Director Madan : కృష్ణ మరణం నుంచి తేరుకోకముందే, టాలీవుడ్‌కి మరో షాక్... దర్శకుడు మదన్ హఠాన్మరణం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర సీమ షాక్‌కు గురైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు ఎన్నో సాంకేతిక హంగులు అద్ది, తన పేరిట ఎన్నో రికార్డులను రాసుకున్న కృష్ణ మరణం నుంచి ఇప్పట్లో టాలీవుడ్ కోలుకోలేదు. దీని నుంచి తేరుకోకముందే తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో మదన్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. మదన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
ఇదీ మదన్ ప్రస్థానం:
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మదన్ స్వస్థలం. ఆయన పూర్తి పేరు రామిగాని మదన్ మోహన్ రెడ్డి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మదన్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఎక్కువ. కాలేజీలో చదువుకున్న రోజుల్లో చిన్న చిన్న కథలను స్వయంగా రాసుకుని స్నేహితులతో కలిసి షార్ట్ స్టోరీస్‌లా తీసేవారు. అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన మదన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా రెండేళ్ల పాటు పనిచేశారు. తర్వాత కొన్ని సినిమాలకు కో రైటర్‌గానూ పనిచేసిన ఆయన.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన రచయితల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
‘ఆ నలుగురు’తో గుర్తింపు :
నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరోగా 2004లో వచ్చిన ‘‘ఆ నలుగురు’’ చిత్రానికి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. ఈ సినిమా మదన్‌కు మంచిపేరు తీసుకొచ్చింది. అనంతరం ‘‘ఆ నలుగురు ఫిలిమ్స్’’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పెళ్లయిన కొత్తలో చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. తర్వాత వరుసగా గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం, గాయత్రి వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout