కొత్త సినిమాలు విడుదల కష్టమేనట...

  • IndiaGlitz, [Sunday,December 13 2020]

నిర్మాతలు, మల్టీప్లెక్స్‌ల మధ్య సయోధ్య కుదరనందున కొత్త సినిమాల విడుదల సందేహాస్పదంగానే మారిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల తేదీలను ప్రకటించేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం వారి ప్లాన్స్‌ను తలకిందులు చేస్తోందని సమాచారం. కాగా.. మల్టీప్లెక్స్‌ల నిర్వహకులకు, టాలీవుడ్ నిర్మాతలకు మధ్య కొన్ని క్లిష్టమైన అంశాలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని తెలుస్తోంది. తమ మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కానిదే.. కొత్త సినిమాల విడుదలపై నిర్ణయం తీసుకోవడం అసంభవమని నిర్మాతలు చెబుతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

అయితే మల్టీప్లెక్స్ యాజమాన్యానికి, నిర్మాతలకు మధ్య చర్చలు తుది దశకు చేరుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల తేదీని ప్రకటించుకున్న సినిమాలు విడుదల అవుతాయా? లేదా? అనే దానిపై సందేహం నెలకొంది. తమ డిమాండ్లను మల్టీప్లెక్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని నిర్మాతలు భావిస్తున్నట్టు వారి సన్నిహితులు చెబతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ షేరింగ్ ఏకరీతిన ఉండాలని.. తమకు ఎక్కువ వాటా ఇవ్వాలని.. అలాగే తమ నుంచి వీపీఎఫ్ వసూలు చేయరాదని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పలు ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి.