'ఫిదా' వరుణ్ కెరీర్ లోబెస్ట్ మూవీ - దిల్ రాజు

  • IndiaGlitz, [Monday,July 17 2017]

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'ఫిదా'. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా జూలై 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు ఇంట‌ర్వ్యూ..
'ఫిదా' అలా కుదిరింది...
శేఖ‌ర్ క‌మ్ముల‌తో ఎప్ప‌టి నుండో సినిమా చేయాల‌నుకున్నాను. కానీ నా మైండ్‌సెట్‌కు ఆయ‌న స‌రిపోతాడా అని ఆలోచించేవాడిని. అయితే 'హ్యాపీడేస్' సినిమాను నేనే రిలీజ్ చేస్తున్న‌ప్పుడు మా ఇద్ద‌రి ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు క‌లిశాయి. త‌ప్ప‌కుండా శేఖ‌ర్ తో సినిమా చేస్తే వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగింది. కానీ ఆయ‌న న‌న్నెప్పుడూ ఆప్రోచ్ కాలేదు. శేఖ‌ర్ క‌మ్ముల 'లీడ‌ర్‌' సినిమా చేస్తున్న‌ప్పుడు ఏదైనా స్క్రిప్ట్ బాగుంటే చెప్పండి సినిమా చేద్దామ‌ని అన్నాను. ఈ స్క్రిప్ట్ శేఖ‌ర్ ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుండో ఉంది. త‌ను ఈ 'ఫిదా' స్క్రిప్ట్‌ను వైస్రాయ్ హోటల్‌లో వినిపించాడు. నాకు బాగా న‌చ్చింది. శేఖ‌ర్ చాలా రోజుల త‌ర్వాత అవుటండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ లవ్‌స్టోరీ 'ఫిదా'.
ముందు స్టార్ హీరోతో అనుకున్నాం...
ముందు ఈ క‌థ‌ను స్టార్ హీరోతో చేయాల‌నుకున్నాం. మా త‌ర‌పున అప్రోచ్ అయ్యాం. క‌థ అంద‌రికీ న‌చ్చినా, మేం చేయ‌డం క‌రెక్టా అని ఆలోచించారు. చివ‌ర‌కు అప్‌క‌మింగ్ హీరోతో సినిమా చేద్దామ‌ని అనుకుని వరుణ్‌ని అప్రోచ్ అయ్యాం. వ‌రుణ్‌కు స్టోరీ న‌చ్చ‌డంతో సినిమా ప్రారంభం అయ్యింది.
హ‌ద్దులు పెట్ట‌ను...
నేను ఏ ద‌ర్శ‌కుడికి హ‌ద్దులు పెట్ట‌ను. శేఖ‌ర్‌గారిని ఆయ‌న స్టైల్లోనే సినిమా తీయ‌మ‌ని అన్నాను. హీరోకు కాలు ఫ్రాక్చ‌ర్ కావ‌డం, హీరో వేరే సినిమాలో బిజీగా ఉండ‌టం వంటి కార‌ణాల‌తో సినిమా లేట్ అయ్యిందే త‌ప్ప‌, శేఖ‌ర్ గ‌త చిత్రాల కంటే త‌క్కువ వ‌ర్కింగ్ డేస్‌లోనే ఈ సినిమాను పూర్తి చేశాం. శేఖ‌ర్ గొప్ప క‌థ రాయ‌డు. కానీ గొప్ప సీన్స్‌ను రాస్తాడు. శేఖ‌ర్‌గారికి రైట్ టైంలో వ‌స్తున్న సినిమా ఇది.
వ‌రుణ్ ఇమేజ్ గురించి ఆలోచించ‌లేదు...
ప‌వ‌న్‌గారికి 'తొలిప్రేమ‌' నాల‌గ‌వ సినిమా. అప్ప‌టికే త‌న‌కు ఓ ఇమేజ్ ఉంది. అలాగే బ‌న్నికి ఆర్య రెండో సినిమా. ఇప్పుడు వ‌రుణ్‌కు 'ఫిదా' నాలుగో సినిమాయే కాబ‌ట్టి వ‌రుణ్ వెళ్ళి నలుగురిని కొట్టేయాల‌ని ఆడియెన్ అనుకోడు. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో క‌థ‌కు అనుగుణంగా స్టార్ వేల్యూ ఉన్న మ‌హేష్ ఒదగిపోయాడు. అలాగే బృందావ‌నం, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాల్లో ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి చేశారు. అలాగే ఇక్కడ వ‌రుణ్ కూడా అన్ని ప‌క్కన పెట్టి, ఏమీ ఆలోచించ‌కుండా చేశాడు. వ‌రుణ్ కెరీర్‌లో అనుకున్న స్థాయిలో హిట్ లేదు. త‌ను క‌ష్ట‌ప‌డుతున్నాడు. 'ఫిదా' వ‌రుణ్‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ ఫిలిం అవుతుంది.
అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది...
'ఫిదా' ఆంధ్ర‌, తెలంగాణకు చెందిన ప్రేమ‌క‌థ కాదు. అమ్మాయి తెలంగాణ‌కు చెందిన భాన్సువాడ‌, అబ్బాయి యు.ఎస్‌లో సెటిల్ అయిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందిన‌వాడు. అయితే ఇది ప్రాంతాల‌కు చెందిన ప్రేమ క‌థ కాదు. ఓ పెళ్ళిలో క‌లిసిన హీరో హీరోయిన్లు వారి క‌ల‌ల‌ను ఎలా నేర‌వేర్చుకున్నార‌నేదే క‌థ‌. అబ్బాయి సాఫ్ట్ నేచుర్ అయితే అమ్మాయి రెబ‌ల్‌. ఇలా ఇద్ద‌రు వేర్వేరు మ‌న‌స్త‌త్వాలుండే వ్య‌క్తుల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌. దీంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో న‌డిచే క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.
సాయిప‌ల్ల‌వి కోసం వెయిట్ చేశాం...
ముందు హీరోయిన్‌గా ఎవ‌రు చేస్తే బావుటుంద‌ని ఆలోచించాం. నేను సాయిప‌ల్ల‌వి ఈ క్యారెక్ట‌ర్ చేస్తే బావుంటుంద‌ని చెప్పాను. స‌రేన‌ని శేఖ‌ర్ టీం సాయిప‌ల్ల‌వి కాంటాక్ట్ చేశారు. కానీ సాయిప‌ల్ల‌వి మెడిసిన్ చ‌దువుతుంది. అందువ‌ల్ల ఆరు నెల‌లు పాటు వెయిట్ చేయాల‌ని చెప్పింది. స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు మాకు కూడా ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. త‌ర్వాత స్క్రిప్ట్ చెప్పాం. త‌న‌కు బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి అంగీక‌రించింది. సినిమాలో క్యారెక్ట‌ర్ కోసం తెలంగాణ యాస నేర్చుకుని డ‌బ్బింగ్ చెప్పింది. రేపు థియేట‌ర్స్‌లో సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌ను చూసి ఆడియెన్స్ ఫిదా అయిపోతారు.
నిర్మాత‌గా డీజే విష‌యంలో హ్యాపీ....
మంచి సినిమాకు ఎంత ఖ‌ర్చు పెట్టాల‌నేది నేను ముందుగానే యోచిస్తాను. ఫిదా విష‌యంలో మేం అనుకున్న బ‌డ్జెట్ కంటే ప‌దిశాతం ఎక్కువైంది. డీజే నిర్మాత‌గా నేను చాలా హ్యాపీ. స‌క్సెస్‌మీట్ రోజునే హ్యాట్రిక్ మూవీ అని అనౌన్స్ చేశానంటేనే సినిమా నిర్మాత‌గా నేను స‌క్సెస్ అయిపోయాను. నేను స్టేట్‌మెంట్ ఇస్తే ఒక వేల్యూ ఉంటుంది. స‌క్సెస్ సినిమా తీయ‌న‌ప్పుడు నేను మాట్లాడ‌ను. డీజే సినిమా బ‌న్ని కెరీర్‌లో బెస్ట్ మూవీ స‌రైనోడు రెవెన్యూను క్రాస్ చేసిందంటే అది హిట్టా, ఫెయిలా అని ఆలోచించుకోవాలి. సినిమా విష‌యంలో ఒక నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గా ఆలోచిస్తాను. కాబ‌ట్టి నా సినిమాల‌ను విడుద‌ల చేస్తున్న నాతో ట్రావెల్ అయ్యే డిస్ట్రిబ్యూట‌ర్స్ లాభ‌న‌ష్టాల గురించి కూడా ఆలోచిస్తాను. దిల్‌రాజు ఎప్పుడూ రాంగ్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డు.
జిఎస్‌టి గురించి..
ఇంత‌కు ముందు వ‌చ్చిన షేర్ క‌లెక్ష‌న్స్ పోల్చితే జిఎస్‌టి ప్ర‌భావం ఇప్పుడు ప‌దిశాతం క‌న‌ప‌డుతుంది. జిఎస్‌టిపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆ క్లారిటీ వ‌స్తే జిఎస్‌టి పై నిర్మాత‌ల‌కు ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.
డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం...
డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం గురించి నాకు తెలియ‌దు. ఎందుకంటే నేను డీజే విడుద‌ల త‌ర్వాత యు.ఎస్‌కు వెళ్ళిపోయాను. ఈరోజు సిటీలోకి వ‌చ్చాను. కాబ‌ట్టి ఇక్క‌డేం జ‌రిగిందో నాకు తెలియ‌దు.
అదే సీక్రెట్‌...
ఆడియెన్స్‌కు న‌చ్చేలా సినిమా తీయ‌డ‌మే నా స‌క్సెస్ సీక్రెట్‌
తదుప‌రి చిత్రాలు...
రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తాను. కానీ ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు. రెడీ అయిన త‌ర్వాత హీరో వినాలి. ఆయ‌న‌కు న‌చ్చాలి. అన్ని కుదిరితే అధికార‌కంగా నేనే ప్ర‌క‌టిస్తాను. మహేష్‌బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో చేయ‌బోయే సినిమా జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షెడ్యూల్ జ‌రుగుతుంది.