ఒంటరైన అజిత్ పవార్... శరద్ పవార్ వారసురాలు సుప్రియానే : దిగ్విజయ్
- IndiaGlitz, [Sunday,November 24 2019]
మహారాష్ట్ర రాజకీయం దేశం మొత్తం ముక్కున వేలేసుకునేలా చేసింది. అయ్యారే తెల్లవారేలోపు మరీ ఇంత మార్పా? మోడీ షా అంటే మాటలా మరీ... వాళ్లు తలుచుకుంటే కొండమీది కోతినైనా తీసుకురాగలరు అని మాట్లాడుకుంటున్నారు సామాన్యులు సైతం. రాత్రికి రాత్రే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు స్వస్తి పలికి... దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం .. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ డిప్యూటీగా ప్రమాణం చేయడం హుటాహుటిన జరిగిపోయాయ్.
దీంతో అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు అవాక్కయ్యాయ్. శివాజీ ఛత్రపతి వారసత్వమున్న మహారాష్ట్రలో ఇంత నీచరాజకీయాలా అంటూ బీజేపీపై విమర్శలకు దిగాయ్. ఇక తనకు ఢోకా ఇచ్చిన మేనల్లుడు అజిత్ పవార్ ను శాసనసభా పక్ష నేతగా తొలగించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు.
ఈ మహా రాజకీయ పరిణామాలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 53 మంది శరద్ పవార్ తోనే ఉన్నారని... అజిత్ పవార్ ఒంటరి అయ్యాడని ట్వీట్ చేశారు. అంతే కాదు ఇక శరద్ పవార్ వారసురాలు తన కూతురు సుప్రియ సూలెనె అంటూ సుప్రియాకు శుభాకాంక్షలు తెలిపారు.