మహేశ్ ఇంటి ముందు ధర్నానా..? ‘సరిలేరు’ ప్రమోషన్ స్టంటా!?

  • IndiaGlitz, [Friday,January 10 2020]

అమరావతి తరలింపు వ్యవహారంపై నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ నేతలు సైతం ఈ ధర్నాలో పాల్గొంటూ మద్దతిస్తున్నారు. మరోవైపు ఈ రైతుల ఆందోళనకు రోజురోజుకూ ఉదృతమవుతోంది. ఈ క్రమంలో ఈ మూడు రాజధానుల వ్యవహారంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ స్వాగతిస్తూ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి మద్దతిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయనపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోలు స్పందించాలని ఇప్పటికే రైతులు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఎంతకీ స్పందించకపోవడంతో నటీనటుల ఇళ్లను ముట్టడించడానికి ప్రజా సంఘాలు సిద్ధమయ్యాయి.

ఇంటి ముందు ధర్నా..!
శుక్రవారం రోజున సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఏపీ రాజధాని కోసం విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఈ విషయమంపై మహేశ్ బాబు మిగిలిన హీరోలు కూడా స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ నేతలు చెబుతున్నారు. ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి అధ్యక్షుడు షేక్ జిలాని మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు.

ముగ్గురు అరెస్ట్!
మహేశ్ ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు జూబ్లిహిల్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇంటి ముందు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ విషయంపై మహేశ్ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఈ ఘటన జరిగినప్పుడు మహేశ్ ఇంట్లో ఉన్నారా..? లేదా..? అనే విషయం తెలియాల్సి ఉంది.

సరిలేరు స్టంట్సా..!?
వాస్తవానికి ఏదైనా హీరో సినిమా రిలీజ్ అయితే చిత్రబృందం చేసే స్టంట్స్ అన్నీ ఇన్నీ కావు. సినిమా ప్రమోషన్ చేయడానికి ఎన్నెన్ని పనులైనా చేయడానికి సిద్ధమవుతుంది చిత్రబృందం. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రేపు రిలీజ్ కానున్నది. అయితే ధర్నా, అరెస్ట్ ఈ వ్యవహారమంతా సినిమా ప్రమోషన్ స్టంట్ అని.. పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సూపర్‌స్టార్ సినిమా కదా.. ఇలాంటివన్నీ మాకేం అవసరం అని మహేశ్ ఫ్యాన్స్.. విమర్శకులకు కౌంటరిస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మహేశ్ స్పందించాల్సిదే.!!