రైతుల భూముల సంపూర్ణ రక్షణకే ధరణి పోర్టల్: కేసీఆర్

  • IndiaGlitz, [Thursday,October 29 2020]

మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్లు సైతం వెంటనే పూర్తయ్యేలా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఇక నుంచి రెవెన్యూ విధానంలో పూర్తి పారదర్శకత ఉండటంతో పాటు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ చేశారు. ధరణి వెబ్‌సైట్‌లో పలు మార్పులు చేశారు.

ఇక మీదట ఎమ్మార్వో కార్యాలయంలో 15 నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 570 ఎమ్మార్వో కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కాగా.. ఇప్పటి వరకూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల విషయానికి వస్తే భూమిని కొనుగోలు చేసేవారు లేకున్నా తమ ప్రతినిధిని పంపిస్తే పని పూర్తయ్యేది. కానీ ఇకమీదట.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై భూముల క్రయవిక్రయాలు జరిపేవారిద్దరూ ఎమ్మార్వో ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.

కాగా.. హైదరాబాద్‌, పట్టణ ప్రాంతాలు మినహా గ్రామీణ ప్రాంతాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ భారతదేశానికి ఒక ట్రెండ్ సెట్టర్‌లా నిలుస్తుందన్నారు. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ కల్పించేందుకే ఈ ధరణి పోర్టల్‌ను ప్రారంభించినట్టు కేసీఆర్ తెలిపారు. విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ పోర్టల్ ద్వారా తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీల విషయంలో ఒక్క పైసా కూడా పెంచలేదని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.