థర్డ్ వేవ్ ముగిసింది.. ఏ ఆంక్షలు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయొచ్చు: తెలంగాణ ప్రభుత్వం

  • IndiaGlitz, [Tuesday,February 08 2022]

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయినట్లేనని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 23న మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని.. ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కరోనా ఆంక్షలు లేవని ఆయన ప్రకటించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కోవిడ్ ప్రభావం తక్కువగా ఉందని... ఫీవర్‌ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని డీహెచ్ పేర్కొన్నారు. కరోనా మూడో దశ ముగిసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ..నిబంధనలు తప్పక పాటించాలని ఆయన సూచించారు. కరోనా థర్డ్ వేవ్ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందని డీహెచ్ తెలిపారు. ఈ వేవ్‌లో టీకా తీసుకొని వారు 2.8 శాతం మంది ఆస్పత్రి పాలయ్యారని.. 31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చెప్పారు. థర్డ్ వేవ్‌లో జనవరి 25న రాష్ట్రంలో అత్యధికంగా 4,800 కేసులు నమోదైనట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మూడో దశలో కేవలం 3 వేల మంది రోగులు మాత్రమే ఆస్పత్రుల్లో చేరారన్నారు. ఇటీవల నిర్వహించిన ఫీవర్ సర్వేలో నాలుగు లక్షల మందికి కిట్లు అందజేసినట్లు తెలిపారు.

కరోనా ఆంక్షలు లేనందున అన్ని సంస్థలు 100 శాతం పూర్తి సామర్ధ్యంతో పని చేయొచ్చని డీహెచ్ సూచించారు. ఐటీ కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రం హోం తీసివేయొచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని.. ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయని శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో జరగనున్న మేడారం జాతరలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీహెచ్ చెప్పారు. ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్‌ కలిగిన ఆస్పత్రిని సిద్ధం చేసినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు.