Revanth Reddy:రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. శుభాకాంక్షలు..
- IndiaGlitz, [Sunday,December 03 2023]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ వెంట పలువురు ఐపీఎస్ అధికారులు సైతం ఉన్నారు. రేవంత్ సీఎం అభ్యర్థి కావడంతో ఆయనకు కల్పించే భద్రతపై ఈ మేరకు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి నాంపల్లిలోని గాంధీభవన్‌కు బయలుదేరి వెళ్లారు. దీంతో పోలీసులు దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ విజయాన్ని సోనియా గాంధీకి బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. టీపీసీసీ చీఫ్ కాబట్టే డీజీపీ రేవంత్ రెడ్డిని కలిశారని..తాను సీఎం రేసులో ఉన్నానా.? లేదా.? అనేది అప్రస్తుతమని వ్యాఖ్యానించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు విజయం ఖాయం చేసుకోగా.. 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదుచేసుకుంది. అంబర్ పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గెలుపొందారు. ఎంఐఎం చార్మినార్ నియోజకవర్గం నుంచి గెలుపొందింది.