'దేవుళ్లు' కి 15 ఏళ్లు
- IndiaGlitz, [Tuesday,November 10 2015]
ఆడియోలోని అన్ని పాటలు ఆదరణ పొందడం అరుదుగా జరుగుతుంది. ఒక్కో తరహా భక్తిగీతంతో పాటు.. రెండు సందర్భానుసారంగా పాటలతో ఉన్న 'దేవుళ్లు' ఆడియో కూడా ఇలాంటి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.
'అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా' వంటి ఎవర్గ్రీన్ సాంగ్తో పాటు 'వక్రతుండ మహాకాయ', 'సిరులనొసగు', 'మహా కనక దుర్గ', 'అయ్యప్ప దేవాయనమహ', 'శాంతినికేతన గీతం', 'మీ ప్రేమ కోరే చిన్నారులం'.. ఇలా ప్రతి గీతం జనాదరణ పొందిన వైనం 'దేవుళ్లు' సినిమాలోని పాటలకుంది. అందుకే ఈ పాటలకిగానూ.. 2000లో ఉత్తమ సంగీత దర్శకుడుగా 'వందేమాతరం' శ్రీనివాస్ నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
పృథ్వీరాజ్, రాశి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుమన్, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, లయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన 'దేవుళ్లు'కి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 10, 2000న రిలీజైన 'దేవుళ్లు'.. నేటితో 15 ఏళ్లను పూర్తిచేసుకుంటోంది.