టీడీపీకి దేవినేని రాజీనామా.. జగన్ సమక్షంలో వైసీపీలోకి!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు యువత అధ్యక్షుడు, మంత్రిగా కొడాలి నానినే ఢీ కొన్న నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.! ఆయన ఇప్పటికే.. అధికారికంగా రాజీనామా చేసినప్పటికీ ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా అటు టీడీపీ నేతలు.. ఇటు దేవినేని అనుచరులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇప్పటికే దేవినేని అవినాష్ రాజీనామా చేసేశారని.. విదేశాల్లో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమరావతికి రాగానే.. వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్న రోజే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెబుతారని సమాచారం.
తూచ్.. అవన్నీ వదంతులు!
అంతేకాదు దేవినేనితో పాటు కడియాల బుచ్చిబాబు, ప్రధాన అనుచరులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీకి రాజీనామా చేసేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రాజీనామా వ్యవహారం, వైసీపీలో చేరికల వ్యవహారం ఇటు టీవీ చానెళ్లలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ దేవినేని అవినాష్ అనుచరులు కొట్టిపారేస్తున్నారు. కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అవినాష్‌కు పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దంటున్నారు.
సోషల్ మీడియాలో హల్ చల్..!
"దేవినేని అవినాష్ గారు వైసీపీలోకి వెళుతున్నారు... వెళ్లిపోయారు అని వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆయన పార్టీ మారలేదు, మారబోరు కూడా!. విశ్వసనీయ వర్గం నుంచి సమాచరం వచ్చింది కాబట్టి ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. తప్పుడు ప్రచారాలు చేసి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు" అని తీవ్ర విమర్శలు గుప్పిస్తు్న్నారు.
దేవినేని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదీ..!
అయితే దేవినేని అవినాష్ రాజీనామా చేసిన మాట.. వైసీపీలోకి చేరే ఆలోచన వాస్తవం అయితే మాత్రం టీడీపీకీ భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో అంతంత మాత్రమే ఉన్న టీడీపీకి పూర్తిగా కోల్పోయినట్లవుతుంది. కాగా దేవినేని కుటుంబం ఆది నుంచి టీడీపీతో మంచి సంబంధాలు కలిగి ఉంది. టీడీపీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్‌కు విధేయుడిగా.. చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ ఒకరు. ఎన్టీఆర్ కేబినెట్‌లో నెహ్రూ మంత్రిగా కూడా పనిచేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 1995 ఎపిసోడ్ తరువాత టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2017 వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. టీడీపీలో చేరిన అతి కొద్దికాలంలోనే (2017 ఏప్రిల్ 17న) నెహ్రూ అనారోగ్యంతో మృతి చెందారు.
తండ్రి మరణం తర్వాత ‘కీ’!
తండ్రి మరణాంతరం కుమారుడు అవినాష్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అవినాష్ దమ్మును గుర్తించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు వరుసగా రెండుసార్లు తెలుగు యువత అధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి టీడీపీ తరఫున అవినాష్‌ను బరిలోకి దింపారు. అయితే నానిపై 19వేలకు పైలుకు ఓట్లతో అవినాష్ ఓటమిపాలయ్యారు. అయితే సామాజిక వర్గం బాగా కలిసొస్తుందని కచ్చితంగా దేవినేనే గెలుస్తారని అందరూ అనుకున్నారు.. అయితే ఓటమెరగని నేతగా పేరుగాంచిన నానీ గెలిచి ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఈ రేంజ్‌లో వార్తలు వినిపిస్తున్నప్పటికీ యువనేత ఇంతవరకూ రియాక్ట్ కాకపోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments