దేవిశ్రీ ప్రసాద్ గురుస్మరణ
- IndiaGlitz, [Monday,February 27 2017]
మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అనే నేర్పించారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ మాటలను అసలు మర్చిపోలేదు. ఇటీవల తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన కోసం నాన్నకు ప్రేమతో అనే పాట రాసి పాడి కంపోజ్ చేసి అందరి మనసులను కరిగించారు. ఇప్పుడు తనకు సంగీతం నేర్పిన మాండలిన్ శ్రీనివాస్‌కు స్మృత్యంజలి ఘటిస్తున్నారు. మాండలిన్ శ్రీనివాస్ కోసం ఆయన 'గురువే నమః' అనే పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. మాండలిన్ శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 28న ఆ ట్రాక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
ఈ పాటను సంస్కృతంలో ప్రముఖ లిరిసిస్ట్ జొన్నవిత్తుల రాశారు. ఈ పాట గురించి దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ''గురువు గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం. అందుకోసం నేను సంగీతం ద్వారా చెప్పాలనుకున్నాను. నేను ఈ పాటను కీరవాణిరాగంలో కంపోజ్ చేశాను. మా గురువు శ్రీ మాండలిన్ శ్రీనివాస్ అన్నయ్యకి చాలా ఇష్టమైన రాగమది. ప్రతి నోట్స్ మా గురువులోని అత్యుత్తమ విషయాన్ని చెప్పేలా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే చేశాను. నేను ఈ పాటను సంస్కృతంలో ఎందుకు రాయించానంటే అది విశ్వవ్యాప్తం కావాలని.
మా గురువు కి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. అందువల్లనే జొన్నవిత్తులగారిని కలిసి రాయమన్నారు. చాలా అందంగా రాశారు ఆయన. నేను ఈ పాటకు మ్యూజిక్ వీడియో చేశాను. శ్రీనివాస్ అన్న కి సంబంధించిన అరుదైన అందమైన పెర్ఫార్మెన్స్ లు అందులో ఉంటాయి. ఆయన్ని దేవుడిగా కొలిచే ఆయన శిష్యులు అందరికీ అది చేరువ కావాలి. ఒక గురువు గొప్పతనాన్ని వర్ణించే పాట అది. లహరి మ్యూజిక్ ద్వారా మేం ఈ పాటను విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్క గొప్ప గురువుకు ఇది చెందుతుంది'' అని అన్నారు. మాండలిన్ జయంతి రోజు చెన్నైలో ఆయనకు అంకితంగా సంగీతవిభావరి ప్రతిఏడాదిలాగా ఈ సారి కూడా జరుగుతుంది.