సాంకేతికంగా మనుషులు అభివృద్ధి చెందుతున్నారు కానీ..సమాజంలో నేరాలను అరికట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. అందులో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అకృత్యాలు అన్ని ఇన్ని కావు. వీటని కొత్త కోణంలో చూపడానికి దర్శకుడు చేసిన ప్రయత్నమే `దేవిశ్రీ ప్రసాద్` చిత్రం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పేరుతో వచ్చిన సినిమా కావడం ఒకవైపు, శవం పక్కన ముగ్గురు అబ్బాయిలు కూర్చొని సెల్ఫీ తీసుకుంటున్నట్లు వచ్చిన పోస్టర్స్‌తో పాటు టీజర్ అన్ని సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని కల్పించడంలో పెద్ద సక్సెస్ అయ్యాయి. చిన్న సినిమా ప్రజల్లోకి చొచ్చుకెళడానికి ఈ నెగటివ్ ప్రచారం కూడా దోహద పడిందనే చెప్పాలి. ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించాలి. శవాన్ని రేప్ చేయడం అనే కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ కాన్సెప్ట్‌తో సినిమాలు రూపొందడం ఏంటని సినిమా విడుదల ముందు విమర్శలు చేసిన వాళ్లు సినిమా విడుదల కోసం కాస్త ఆసక్తికరంగానే వెయిట్ చేశారు. మరి అసలు దేవిశ్రీ సినిమాలో దర్శకుడు శ్రీకిషోర్ ఏం చెప్పాలనుకున్నట్లు? అనేది తెలియాలంటే కథలోకి ఓ లుక్కేద్దాం.
కథ:
దేవి(భూపాల్ రాజు)..ఆటో నడుపుతుంటాడు. మానసికంగా నెగటివ్ స్వభావం ఎక్కువగా ఉంటుంది. శ్రీ(ధనరాజ్)..హాస్పిటల్‌లో వార్డు బాయ్. గోడమీద పిల్లిలాంటి వ్యక్తి. అంటే కాస్త మంచోడు, కాస్త చెడ్డోడు. ఇక ప్రసాద్(మనోజ్ నందం)..టీ కొట్టు నడుపుతుంటాడు. చాలా మంచివాడు. తోటివారికి సహాయం చేయాలనుకుంటాడు. ఏ పని చేసినా ముగ్గురు కలిసే చేస్తుంటారు. ఈ ముగ్గరుకి హీరోయిన్ లీల అంటే చాలా ఇష్టం. తమ ఏరియాలోనే లీల షూటింగ్‌కి వచ్చిందని తెలుసుకున్న ఈ ముగ్గరు, ఆమెను చూడటానికి వెళ్తారు కానీ, దూరం నుండే చూసి వచ్చేస్తారు. కానీ అదే రోజు సాయంత్రానికి లీల ఓ యాక్సిడెంట్‌లో చనిపోయిందనే ముగ్గురుకి తెలుస్తుంది. అదీగాక ఆమె శవాన్ని శ్రీ ఉండే హాస్పిటల్‌కే తీసుకొస్తారు. పొద్దున్నే ఆమె బంధువులకు శవాన్ని అప్పగించేస్తామని డాక్టర్లు చెబుతారు. లీలను బ్రతికుండగా దగ్గరగా చూడలేదు కాబట్టి కనీసం చనిపోయిన తర్వాత అయిన దగ్గర నుండి చూస్తామని హాస్పిటల్ చేరుకుంటారు. శ్రీ సహాయంతో మార్చురీ గదికి వెళ్తారు. లీల శరీరాన్ని చూడగానే దేవికి ఆమెతో సంభోగం చేయాలనే కోరిక వస్తుంది. అయితే శ్రీ, ప్రసాద్‌లు వద్దని వారించినా దేవి వినడు. అప్పుడు ఏం జరగుతుంది? అసలు లీల మరణానికి కారణం ఎవరు? చివరకు కథ ఏ మలుపులు తీసుకుంటుందనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
సినిమాలో క్యారెక్టర్స్ చాలా తక్కువ. సినిమా వ్యవథి కూడా చాలా తక్కువగా ఉండటం సినిమాకు మెయిన్ హైలైట్. సినిమాలో ఏదీ ఎక్కువగా అనిపించదు. సినిమా అంతా ఐదు క్యారెక్టర్స్ మధ్యనే ఎక్కువగా తిరుగుతుంది. దేవి, శ్రీ, ప్రసాద్ క్యారెక్టర్స్‌లో నటించిన భూపాల్, ధన్‌రాజ్, మనోజ్ నందంలు అతికినట్లు సరిపోయారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వీరి నటన మెప్పిస్తుంది. అలాగే పోసాని కృష్ణమురళి కామెడీ టచ్‌తో ఎప్పటిలాగానే అలరించింది. ఇక లీల క్యారెక్టర్లో నటించిన పూజా రామచంద్రన్ నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ సినిమా కథ ఆమెపైనే తిరుగుతుంది. సినిమా పస్టాప్ లో ఎక్కువ భాగం క్యారెక్టర్స్‌ను ఇంట్రడ్యూస్ చేయడానికే సరిపోయింది. సెకండాఫ్‌లో చనిపోయిందనుకున్న లీల బ్రతికి రావడం..చనిపోయిందనుకున్న లీల ఎలా బ్రతికింది. అసలు ఆమె మరణానికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు ప్రేక్షకుడిని తరుముతుంటే, మరోపక్క హాస్పిటల్‌లో లీల ఎలాంటి ఇబ్బందులు పడింది. ఎలా బయటపడిందనే దానిపైనే సినిమా నడుస్తుంది. దర్శకుడు శ్రీ కిషోర్ స్త్రీలకు రక్షణ లేకుండా పోతుందనే చిన్న పాయింట్‌ను ఓ కొరియన్ మూవీ ఆధారంగా చేసుకుని తెలుగు నెటివిటీకి తగినట్టు మార్చి తెరకెక్కించాడు. కథలో లాజిక్స్ లేకపోవడం మినహా సినిమా ప్రేక్షకుడికి బోర్ కొట్టించదు.
బోటమ్ లైన్: దేవిశ్రీ ప్రసాద్...కొత్త కాన్సెప్ట్
Comments