Devi Prasad :తోటపల్లి మధు వ్యాఖ్యలపై దేవీప్రసాద్ కౌంటర్.. ఇండస్ట్రీలో హాట్‌టాపిక్.
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరైనా ప్రముఖుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అదే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల గురించి అయితే మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. అదే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి దిగ్గజాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి పదం చూసుకుని మాట్లాడాలి. లేదంటే తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే అనేక మంది నోరుజారి పరువు పోగొట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోటపల్లి మధు చేరిపోయారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దివంగత నటులు సావిత్రి, శ్రీదేవి, జయలలిత, శోభన్ బాబు, ఎమ్‌జీఆర్, జంధ్యాల, కోడి రామకృష్ణ వంటి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా రైటర్ కమ్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో దీనిపై వ్యంగ్యంగా స్పందించారు.
‘ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపైన రాసే అక్షరంతోనే ప్రారంభం అవుతుంది. అందుకే రచయితది ఎప్పటికీ అగ్రస్థానమే అని నమ్ముతాను. నా వరకూ నేను రచయిత స్థాయి.. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ గౌరవిస్తాను. అందరూ గౌరవించాలని కోరుకుంటాను’ అంటూ తోటపల్లి మధు ఫోటోను షేర్ చేశారు. ఆయన గురించి, ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు దేవీ ప్రసాద్. ‘తోటపల్లి మధు గారి వంటివారు మాత్రం కొంత ప్రత్యేకం. వీరికి కొన్ని ప్రత్యేక ప్రతిభలున్నాయి.
‘సీనియర్ రచయిత తోటపల్లి మధు గారు మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే చాలు.. పరిశ్రమలో ఎంత సాధించిన వారినైనా వాడు వీడు అని సంబోధించగలరు. జంధ్యాల గారు, సావిత్రి గారు, శ్రీదేవి గారి లాంటి వారు అసలెందుకు మందుకు బానిస అయ్యారో, రోజుకి ఎన్నిసార్లు తాగేవారో కూడా కళ్ళారా చూసినట్టు చెప్పగలరు. అసలు శ్రీదేవిగారు చనిపోయేముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ ఉన్నట్టే వివరించగలరు. ఎం.జి.ఆర్ గారు స్విస్ బ్యాంక్‌లో దాచిన 3వేల కోట్ల సొమ్ము వివరాల చీటీని ఆయన తన తలపైన టోపీలో దాచుకుంటే జయలలిత గారు దాన్ని తీసి శోభన్ బాబు గారికి ఇస్తే ఆయన భూములు కొని ఎలా లాభపడ్డారో ప్రత్యక్ష సాక్షిలా చెప్పగలరు.
‘అద్భుతమైన నటనను కూడా ప్రదర్శించే వీరి దృష్టిలో జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి నంది అవార్డులు కూడా పొందిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు. మరణించిన మిక్కిలినేని గారి వంటి నటులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారి లాంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగలరు. పాపం అస్సలు మందు వాసనంటే తెలియని వీరు... ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ, అవి కూడా డాక్టర్లే ఇస్తారనీ చూసినట్లే చెప్పి అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగలరు.
‘వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన మా గురువు గారు ఈ లోకంలో లేని కోడి రామకృష్ణ గారి మీద అబద్ధాల అవాకులు చెవాకులు పేలగలరు. కానీ వారికి తెలియనిదొక్కటే... మా గురువుగారు లేకపోయినా ఆయన శిష్యులం మేమింకా ఇక్కడే వున్నాం. తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికున్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు విన్యాసాలు అప్పటివి ఇప్పటివి మాకు పరిపూర్ణంగా తెలుసు గనుక వాటిని విశాదపరచి మేమూ మన్ననలందుకోక తప్పేట్టులేదు’ అంటూ సీరియస్ అయ్యారు. అలాగే ‘వారి అబద్ధపు ఘోష మధ్యలో పట్టరాని నవ్వులతో అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవీప్రసాద్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments