ఇద్దరు భిన్న మనసత్తాలున్న వ్యక్తులు కలిసినప్పుడు అక్కడ పెద్ద గొడవైనా క్రియేట్ అవుతుంది.. లేదా పెద్ద కామెడీ అయినా జనరేట్ అవుతుంది. ఇందులో రెండో భాగంతో ప్రేక్షకులను మెప్పించడానికి చేసిన ప్రయత్నమే `దేవదాస్`. ఓ మాఫియా డాన్.. ఓ డాక్టర్ అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని చేసే ప్రయాణం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. డాన్ పాత్రలో నాగార్జున, డాక్టర్ పాత్రలో నాని నటించారు. నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. మరి మల్టీస్టారర్.. అందులో ఎ.ఎన్.ఆర్ టైటిల్ పెట్టిన చిత్రంలో ఆయన తనయుడు నాగార్జున నటించడం.. విడుదల చేసిన ప్రోమోస్ అన్ని ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను దేవ, దాసులు ఏ మేర అందుకున్నారో తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం..
కథ:
దేవ (నాగార్జున) ను శరత్‌కుమార్ పెంచుకుంటాడు. అతని అజ్ఞాతంలో పెంచుతాడు. అనుకోకుండా లోకల్ ముఠా అంతా సిండికేట్ అయి శరత్‌కుమార్‌ను చంపేస్తుంద. ఆ సమయంలో అతని సొంత కొడుకు (నవీన్ చంద్ర) అక్కడే ఉంటాడు. అయితే విషయం తెలిసిన దేవా సిటీలోకి ఎంటర్ అవుతాడు. అతను ఎవరు? ఎలా ఉంటాడనే సంగతి ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి మేనరిజాన్ని బట్టి చేపలను వేయించి అమ్మే మహిళ (ఐశ్వర్య) గుర్తుపడుతుంది. సరిగా దేవా ఆచూకి కోసం వెయిట్ చేసిన పోలీసులు కాల్పులు జరుపుతారు. దేవాకి గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. తప్పించుకుని ధూల్‌పేట వెళ్లి అక్కడ ఓ మామూలు క్లినిక్‌లో చికిత్స పొందుతాడు. అతని గుండెల్లోంచి బుల్లెట్ బయటికి తీసింది దాస్ (నాని). బాగా చదువుకుని నిజాయతీగా పనిచేయాలని పట్నానికి వస్తాడు. అయితే అతని అమాయకత్వం వల్ల ఎక్కువ రోజులు కార్పొరేట్ ఆసుపత్రిల్లో పనిచేయలేకపోయాడు. దాంత దూల్‌పేటలో ఉంటాడు. అతని సోదరుడు (నరేష్)కి మెడికల్ షాప్ ఉంటుంది. అయితే దేవాకి ట్రీట్‌మెంట్ ఇచ్చిన రెండో రోజే దాస్‌కి తాను ట్రీట్‌మెంట్ ఇచ్చింది డాన్ దేవాకేనని అర్థమైపోతుంది. అయినా దేవాతో ఫ్రెండ్‌షిప్ వదులుకోడు. ఆ క్రమంలోనే దేవాకి యాంకర్ జాహ్నవి అంటే ఇష్టమని తెలుసుకుంటాడు. వారిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు తొలి చూపులోనే పూజ (రష్మిక) ప్రేమలో పడతాడు. అనుకోకుండా పూజ అతని ఆసుపత్రికి వస్తుంటుంది. అయితే ఆమె మఫ్టీలో ఉన్న పోలీస్ అని అతనికి తెలియదు. ఓ సందర్భంలో తెలిసినప్పుడు షాక్‌కి గురవుతాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు దేవాకీ, దాస్‌కీ ఫ్రెండ్ షిప్ కొనసాగిందా? లేదా? వారి మధ్య జరిగిన మానసిక సంఘర్షణ ఎలాంటిది? మధ్యలో విలన్ డేవిడ్ ఏం చేశాడు? దేవాని పట్టుకోవడానికి పోలీసులు వేసిన ఎత్తులు ఫలించాయా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ప్లస్ పాయింట్లు:
దేవా పాత్రలో నాగార్జున చాలా బాగా నటించారు. ఓ వైపు మాస్‌గా ఉంటూనే, మరోవైపు స్టైలిష్గా ఉన్నారు. సాఫ్ట్ గా వైట్ కాలర్ జాబ్‌లో, డాక్టర్‌గా కళ్లజోడుతో నాని మెప్పించారు. పాటల్లో గ్లామర్‌గా కనిపించిన ఆకాంక్ష సింగ్, రష్మిక మామూలుగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాన్నాళ్ల తర్వాత ఎస్.పి.బాలసుబ్రమణ్యం తెరమీద కనిపించడం బావుంది. స్క్రీన్ మీద చూసినంత మంది నటీనటులు కనిపించారు. పాటలు బావున్నాయి. రీరికార్డింగ్ బావుంది. కెమెరా పనితనం, కొన్ని యాంగిల్స్ లో తీసిన షాట్స్ బావున్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం కూడా తెరమీద కనిపించింది. కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
మైనస్ పాయింట్లు:
సినిమాలో కొత్తదనం ఏమీ అనిపించలేదు. దర్శకుడు కథను అల్లుకునేటప్పుడే అయితే దేవాడాన్ స్టోరీని రాసుకోవాల్సింది. లేకుంటే దేవా పర్సనల్ స్టోరీని రాసుకోవాల్సింది. రెండింటిని మిక్స్ చేయడం వల్ల కాస్త కంగాళీగా అనిపించినట్టు ఉంటుంది. తొలి సగం పూర్తిగా సినిమాలోని కేరక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికే సరిపోయింది. ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. సన్నివేశాల్లో ల్యాగ్ తగ్గితే బావుండేది. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్‌గా అనిపించింది. ఎక్కడా ఆసక్తికరమైన మలుపులు లేవు. అన్నీ ఊహించేటట్టే ఉన్నాయి.
విశ్లేషణ:
దేవా పాత్రలో నాగార్జున పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు. ఈ తరహా పాత్ర ఆయనకు కొత్తేం కాదు. మాస్‌లోనూ, డాన్‌లోనూ ఆయన ఇలాంటి పాత్రలు చేశారు. కాకపోతే డాన్‌లో ఆయన సైలెంట్‌గా కూర్చుంటారు. ఈ సినిమాలో అలా కాదు. శ్రీనువైట్ల సినిమా `కింగ్`ను కూడా గుర్తుకు తెస్తుంది నాగార్జున పాత్ర. అలాగే వైట్ కాలర్ జాబ్ చేసే యువకుడిగా నాని పక్కగా సూటయ్యాడు. ఈ సినిమాలో ఆయన కాస్ట్యూమ్స్, బ్యాగ్, కళ్లజోడు... అన్నీ పక్కాగా సూటయ్యాయి. అతని ఫ్యామిలీగా నరేష్, సత్యకృష్ణన్ కూడా బాగా నటించారు. లొకేషన్లు, సెట్స్ కృతకంగా లేవు. గణపతి పాటలోనూ, వారూ వీరూ పాటలోనూ నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. ఇష్టం లేని వృత్తి చేసే అమ్మాయిగా ఆకాంక్ష, చేస్తున్న పని కోసం ఎంత దూరమైనా రిస్క్ చేసే అమ్మాయిగా రష్మిక నటించారు. ప్రాణం విలువను చెప్పే సన్నివేశాలు బావున్నాయి. హాస్పిటల్ సన్నివేశాలతో పలువురు కనెక్ట్ అవుతారు. కొన్ని సన్నివేశాలు కళ్లను తడి చేశాయి. సినిమా చూస్తున్నంత సేపు సీన్ కు ఓ కొత్త ఆర్టిస్ట్ పరిచయమవుతూనే ఉన్నట్టుగా అనిపించింది. సంపూర్ణేష్ బాబు, నవీన్ చంద్ర, రావు రమేష్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అవసరాల శ్రీనివాస్, ఐశ్వర్య.. చూసినోళ్లకి చూసినంత మంది ఆర్టిస్టులున్నారు ఈ సినిమాలో. ప్రాణం విలువను చెప్పే సన్నివేశాలు కాసింత ఆకట్టుకుంటాయి. మన గురించి నిజం పూర్తిగా తెలిసినా మనకు దూరం కాని వాళ్లే నిజమైన ఫ్రెండ్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్గాన్ డొనేషన్ గురించి అవగాహన కల్పించడం కోసం ఓ సన్నివేశం ఉంది. సరదాగా కాలక్షేపం కోసం సినిమా చూడాలనుకునేవారు ఓ సారి చూడొచ్చు.
బాటమ్ లైన్: 'దేవదాస్'... ఎంటర్‌టైనింగ్ మూవీ బాస్!
Comments