మెగాస్టార్ చిరు గురువు దేవదాస్ ఇకలేరు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనతో రాజీవ్ కనకాల ఇంట విషాదం నెలకొంది. ఏడాది వ్యవధిలోనే రాజీవ్ ఇంట వరుస విషాధాలు నెలకొన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి-03న దేవదాస్ సతీమణి లక్ష్మీదేవి కన్నుమూయగా.. తాజాగా దేవదాస్ కూడా కన్నుమూశారు. వరుస విషాదాలతో రాజీవ్ కనకాల ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
జననం..:-
1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా చేసారు. తల్లి మహలక్షమమ్మ. తోబుట్టువులు తనతో కలిపి ఎనమండుగురులో తనే పెద్దవాడు. విశాఖపట్టణం లోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆఫ్ట ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. 1971 నవంబరు 21న లక్ష్మీదేవి కనకాలతో దేవదాస్ ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావుతో జరిగింది.. కాగా వీరిద్దరివి కూడా ప్రేమ వివాహాలే కావడం విశేషం.
ఉద్యోగానికి రాజీనామా..!
కాగా.. కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఓ సీత కథ’ లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా చలిచీమలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు.
ప్రముఖలంతా వీరి శిష్యులే..!
నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, హీరో కమ్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణ్‌పాండ్యన్, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే. కాగా వీరంతా ప్రస్తుతం అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలను ఏలుతున్న వారే కావడం సంతోషించదగ్గ విషయమే.
నటించిన సినిమాలు:-
ఇదీ సంగతి (2008)
ఒక్క మగాడు (2008)
మీ ఆయన జాగ్రత్త (2000)
చెట్టు కింద ప్లీడర్ (1989)
సిరిసిరిమువ్వ (1978)
అదృష్టవంతురాలు (1977)
జరుగుతున్న కథ (1977)
ఈ కాలపు పిల్లలు (1976)
మాంగల్యానికి మరో ముడి (1976)
ఓ సీత కథ (1974)[2]
కాలం మారింది (1972)
బుద్ధిమంతుడు (1969)
పేరుతెచ్చిన పాత్రలు..:-
ఓ సీత కథ, మాంగళ్యానికి మరోమూడి, సిరిసిరి మువ్వ, గోరింటాకు, గ్యాంగ్ లీడర్, అమ్మో ఒకటో తారిఖీ, మనసంతా నువ్వే, అసాధ్యుడు, ఒక్కమగాడు, నీ స్నేహం లాంటి సినిమాలు ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. కాగా దేవదాస్ నటించిన చివరి చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. కొరటాల తెరకెక్కించిన ‘భరత్ అనే నేను’ చిత్రమే.
దర్శకత్వం వహించిన చిత్రాలు
‘చలిచీమలు’తో పాటు పలు చిత్రాలను ఆయన తెరకెక్కించారు. కాగా తమ గురువు మరణించారని తెలుసుకున్న రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు అనగా శనివారం జరిగే అంత్యక్రియలకు దేవదాస్ శిష్యులంతా హాజరవుతారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout