Dev Review
హీరో సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా.. ఆవారా, నా పేరు శివ, కాష్మోరా, యుగానికొక్కడు.. రీసెంట్‌గా ఖాకి వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో కార్తి. ఈ యువ కథానాయకుడు ఇప్పుడు దేవ్ అనే చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దేవ్‌తో కార్తి ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడనేది తెలుసుకోవాలంటే ముందు సినిమా కథేంటో చూద్దాం...
కథ:
దేవ్(కార్తి) అడ్వెంచరస్ పర్సన్. రోడ్ ట్రిప్స్.. కొండలు, పర్వతాలు ఎక్కడానికి ఇష్టపడుతుంటాడు. అలాంటి వ్యక్తికి ఫేస్ బుక్ ద్వారా మేఘన(రకుల్ ప్రీత్ సింగ్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ధ్యాసలో ఉంటూ ఆమె వెనుకపడుతుంటాడు. అయితే చిన్నప్పుడే తల్లిని, తనని వదిలి విడిచిపెట్టి వెళ్లిపోతాడు. అప్పటి నుండి తమ కష్టాలకు మగాళ్లే కారణమని మేఘన భావించి కష్టపడి బిజినెస్ ఉమెన్ స్థాయికి ఎదుగుతుంది. ఎవరినీ ప్రేమించదు. ఆమె వెనుకపడుతున్నదేవ్‌ను కూడా ముందుగా పట్టించుకోదు. అయితే తన మంచితనం చూసి తనతో మాట్లాడాలనుకుంటుంది. తర్వాత దేవ్ తనపై చూపిస్తున్న కేర్ చూసి ఎంతగానో ముచ్చటపడి అతనితో ప్రేమలో పడుతుంది. ఓ సందర్భంలో పని ఒత్తిడి కారణంగా దేవ్.. మేఘనతో మాట్లాడడు. దానికి అపార్థం చేసుకున్న మేఘన.. దేవ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతని విడిచి పెట్టేసి అమెరికా వెళ్లిపోతుంది. అదే సమయంలో దేవ్‌కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. చివరకు దేవ్ పరిస్థితేంటి? దేవ్, మేఘన కలుసుకున్నారా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
సినిమాలో కథ చాలా వీక్. సరే మెయిన్ పాయింట్ కామన్‌గానే ఉన్నా.. కథనం, ప్రధానమైన పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బలంగా, ఆసక్తికరంగా, మనసును హత్తుకునేలా ఉండాలి. కానీ దర్శకుడు రజత్ రవిశంకర్ సినిమాను ఆసక్తిరంగా నడపంలో పూర్తిగా విఫలమయ్యాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌కు హత్తుకునే సన్నివేశాలు, ఎమోషన్స్ బలంగా ఉన్నాయి. మంచి సంభాషణలు కుదరాలి. ఈ సినిమాలో అవే ప్రధానంగా మైనస్‌గా కనపడతాయి. సినిమా అంతా ఏదో వెలితిగానే రన్ అవుతుంది. అందుకు కారణం ఇంతకు ముందు పేర్కొన్నట్లు కనెక్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడమే. అలాగే ప్రధానమైన పాత్రలకు హీరో, హీరోయిన్ మినహా మిగతా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటూ చెప్పుకోవాలంటే కార్తినే.. ఎందుకంటే తన స్టైల్లో ఆ పాత్రను చాలా సులభంగా చేసుకుంటూ వెళ్లిపోయాడు కార్తి. అలాగే రకుల్ పాత్ర కూడా బావుంది. ఇప్పటి వరకు తను చేయని సీరియస్ పాత్రలో చక్కగా నటించింది. ఈ రెండు పాత్రలు మినహా హీరో స్నేహితులు, హీరో తండ్రి ప్రకాష్ రాజ్, హీరోయిన్ తల్లి రమ్యకృష్ణ పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. క్యారెక్టర్స్‌ను సరిగ్గా డిజైన్ చేయలేదు. హీరోతో హీరోయిన్ గొడవపడే సీన్ మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక హేరీష్ జైరాజ్ సంగీతం రొటీన్‌గా.. తన ట్యూన్స్‌నే తను కాపీ కొట్టుకున్నట్టు అనిపించింది. ఇక నేపథ్య సంగీతం గురించి ప్రస్తావించాలంటే ఎమోషనల్ సీన్స్‌లో హారర్ మ్యూజిక్ అందించాడు హేరీష్. అయితే వెట్రి కెమెరా పనితనం బావుంది. సినిమా స్లోగా, సాగదీతగా ఉంది.
బోటమ్ లైన్: దేవ్.. మెప్పించలేకపోయాడు
Read 'Dev' Movie Review in English
- Read in English