దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం..

  • IndiaGlitz, [Thursday,March 11 2021]

తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌‌గా దేత్తడి హారిక నియామకం అయిన నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమెను పదవి నుంచి తొలగించారని ఒకరోజు.. లేదని మరొక రోజు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టూరిజం శాఖ మంత్రి సైతం హారిక నియామకానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారమూ లేదని.. ఆమె ఎవరో కూడా తెలియదంటూ వెల్లడించి షాక్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో హారిక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అంతేకాదు.. తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినప్పటి ఫోటోలన్నీ ఆమె తొలగించారు.

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం మొదలైంది. ఈ నియామకం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ వచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక రేంజ్ ఉండాలని.. ఆమె యూ ట్యూబ్ స్టార్ మాత్రమేనని.. అలాంటి ఆమెకు అంత అర్హత ఉందా? అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ మహిళా దినోత్సవం రోజే ఇచ్చేశారు. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా టూరిజం సదరు శాఖ మంత్రి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. కార్పొరేషన్‌ చైర్మన్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారమూ లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. హారిక ఎవరో కూడా తనకు తెలియదని, ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, త్వరలోనే ఈ పరిస్థితిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అన్నారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే మరో సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తామంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో హారిక ఈ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.