Download App

Detective Review

ప్ర‌యోగాలు చేయ‌డానికి ఎప్పుడూ ముందుంటారు విశాల్. ఎన్ని ప‌నులున్నా ప్ర‌తి ఏడాది క్ర‌మం త‌ప్ప‌కుండా సినిమాలు విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకుంటారు. తెలుగు కుర్రాడైనా త‌మిళ‌నాడులో సెటిల్ అయి అక్క‌డ సినిమాలు చేసి, వాటిని తెలుగు ప్రేక్ష‌కుల‌కూ చేరువ‌య్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో ఆయ‌న న‌టించిన `తుప్ప‌రివాల‌న్‌`ను తెలుగులో `డిటెక్టివ్‌` పేరుతో విడుద‌ల చేశారు. ఈ సినిమా విశాల్‌కు త‌మిళంలో మంచి పేరే తెచ్చిపెట్టింది. మ‌రి తెలుగు ప్రేక్ష‌కులు ఏమంటారో ఒక సారి లుక్కేసేయండి..

క‌థ‌:

అద్వైత భూష‌ణ్ (విశాల్‌) డిటెక్టివ్‌. కేసులో క్వాలిటీ ఉంటేనే టేక‌ప్ చేస్తాడు. ఎన్ని డ‌బ్బులు ఇస్తామ‌న్నా కొన్ని కేసుల జోలికి పోడు. అలాంటి అత‌ను ఒక చిన్న‌పిల్లాడు అడిగాడ‌న్న ఉద్దేశంతో కేసును టేక‌ప్ చేస్తాడు. త‌న కుక్క‌పిల్ల చ‌నిపోయింద‌ని, దానికి కార‌ణం క‌నుక్కోమ‌ని కోరుతాడు ఓ బాబు. ఆ కేసును టేక‌ప్ చేస్తాడు అద్వైత భూష‌ణ్‌. అత‌నితో పాటు అత‌ని ఫ్రెండ్ మ‌నో (ప్ర‌స‌న్న‌) కూడా ఉంటాడు. మ‌నో కూడా కేసుల విష‌యంలో అద్వైత భూష‌ణ్‌కి సాయం చేస్తుంటాడు. ఒక సంద‌ర్భంలో వాళ్ల‌కి పిక్‌పాకెట‌ర్ మ‌ల్లిక (అను ఇమ్మాన్యుయేల్‌)తో ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమెను త‌మ వెంటే ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఆమెకు ఇంటి ప‌నిని అప్ప‌గిస్తారు. ఈ క్ర‌మంలోనే కేసు కూడా విచారిస్తూ ఉంటారు. ఆ కుక్క పిల్ల చావును గురించి ఆరా తీసే క్ర‌మంలో అద్వైత‌భూష‌ణ్‌కి ప‌లు విష‌యాలు తెలిసొస్తాయి. అవి ఏంటి?  సిమ్ర‌న్‌, ఆండ్రియా, విన‌య్‌, భాగ్య‌రాజ్‌, జ‌య‌ప్రకాష్‌.. వీరంద‌రూ ఆ కేసుతో ఎలా సంబంధం క‌లిగి ఉన్నారు అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

కుక్క పిల్ల కేసును డీల్ చేయ‌డం ద‌గ్గ‌రే ఇదేదో కొత్త క‌థ‌లా ఉందే అనిపిస్తుంది. ఆ కేసు కోసం అన్వేషించే క్ర‌మంలో ప్ర‌తి ప‌ది నిమిషాల‌కూ ఓ కొత్త విష‌యం తెలుస్తుంటుంది. ఏ మాత్రం సీటు నుంచి క‌దిలినా ఎక్క‌డేం మిస్ అవుతామో అనే టెన్ష‌న్ క్రియేట్ అవుతుంది. మ‌రీ ముఖ్యంగా చైనీస్ రెస్టారెంట్ ఫైట్ త‌ర్వాత క‌థ‌లో వేగం పెరుగుతుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌లో కూర్చుని సినిమా చూడ‌టం మొద‌లుపెడ‌తాడు ప్రేక్ష‌కుడు. విశాల్‌, ప్ర‌స‌న్న న‌ట‌న సెటిల్డ్ గా ఉంటుంది. ఆండ్రియా ప్ర‌తికూల ఛాయ‌ల‌తో చ‌క్క‌గా న‌టించింది. విన‌య్ రాయ్ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించారు. అత‌ను మ‌న‌కు `వాన` చిత్రం హీరోగా సుప‌రిచితుడే. భాగ్య‌రాజ్ ముస‌లి వ్య‌క్తిగా, బాధ్య‌త‌గ‌ల భ‌ర్త‌గా మెప్పించారు. సిమ్ర‌న్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కూ ప్రాధాన్యం ఉంటుంది. వాటికి త‌గ్గ‌ట్టు టెక్నిక‌ల్‌గా ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో స‌పోర్ట్ చేసిన సినిమా. ముఖ్యంగ  అరుళ్ కొరోలీ నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది.

మైన‌స్ పాయింట్లు:

సినిమాను ఏమాత్రం మిస్ అయినా అర్థం కాదు. సినిమాలో లీన‌మై చూస్తే త‌ప్ప అంత తేలిగ్గా అర్థం కాదు. కృత్రిమ మెరుపుల‌ను, ఉరుముల‌ను సృష్టించ‌డం వంటివి సైన్స్ స్టూడెంట్స్ కి ఎక్కినంత తేలిగ్గా స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ఎక్క‌వు. అక్క‌డ‌క్క‌డా సినిమా నిదానంగా సాగిన‌ట్టు అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌:

కొత్త‌క‌థ‌లు మ‌న ద‌గ్గ‌ర రావు. మ‌న‌వాళ్లు చేయ‌లేరు అనుకునేవారికి స‌రైన స‌మాధానం ఈ సినిమా. భాష‌ల‌తో ప్ర‌మేయం లేకుండా యూనివ‌ర్శ‌ల్ పాయింట్‌తో తెర‌కెక్కింది. స్క్రీన్‌ప్లే సినిమాకు హైలైట్‌. నేప‌థ్య సంగీతం కూడా స‌న్నివేశాల్లోని బ‌లాన్ని ఎలివేట్ చేసింది. మ‌న చుట్టూ ఉన్న స‌మాజంలో చాలా జ‌రుగుతుంటాయి. లోతుగా ప‌రిశీలిస్తే వాటిలో ఇంత ఆంత‌ర్యం ఉంటుందా? అని మ‌న‌కు మ‌నం ప్ర‌శ్నించుకునేలా ఉంది చిత్రం. జ‌నాలు మ‌ర్చిపోయిన డిటెక్టివ్ పాత్ర‌ల గురించి కొత్త‌త‌రానికి ఫ్రెష్‌గా గుర్తుచేసిన సినిమా ఇది.

బాట‌మ్ లైన్‌:  వెల్ డిజైన్డ్ డిటెక్టివ్‌

Detective Movie Review in English

 

Rating : 3.0 / 5.0