Vande Bharat: రేపు పట్టాలెక్కనున్న సికింద్రాబాద్ - వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. టైమింగ్స్, ఛార్జీలు ఇవే

  • IndiaGlitz, [Saturday,January 14 2023]

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టనున్న ఈ రైలును రేపు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. నిజానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జనవరి 19న ప్రారంభించాల్సి వుంది. అయితే సంక్రాంతిని పురస్కరించుకుని నాలుగు రోజుల ముందుగానే జనవరి 15న పట్టాలెక్కించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 700 కిలోమీటర్లకు పైగా దూరం. దీనిని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 8.30 గంటల్లో చేరుకుంటుంది.

ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. రేపు ఒక్కరోజు మాత్రం చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్‌లలో ఆగుతుంది. జనవరి 16 నుంచి మాత్రం సికింద్రాబాద్‌లో బయల్దేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిల మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది.

ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులు సర్వీసులు :

వారంలో ఆదివారం మినహా మినహా మిగిలిన ఆరు రోజులు మాత్రమే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. విశాఖ నుంచి బయల్దేరే సమయంలో ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. రైలులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు వుంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఛార్జీలు :

సికింద్రాబాద్ టూ వరంగల్ - 520
సికింద్రాబాద్ టూ ఖమ్మం - 750
సికింద్రాబాద్ టూ విజయవాడ - 905
సికింద్రాబాద్ టూ రాజమండ్రి - 1365
సికింద్రాబాద్ టూ విశాఖపట్నం - 1665