Demat Accounts : స్టాక్ మార్కెట్లలో మదుపుపై మక్కువ.. 10 కోట్లు దాటిన డీమ్యాట్ ఖతాల సంఖ్య
- IndiaGlitz, [Tuesday,September 06 2022]
మారుతున్న కాలమాన పరిస్ధితులకు తగ్గట్టుగానే దేశంలో పొదుపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పోస్టాఫీసులలో , ఫిక్స్డ్ డిపాజిట్లు , బంగారం కొనుగోలు, ఎల్ఐసీ, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో ప్రజలు పొదుపు చేశారు. ఎవరో కొందరు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మాత్రమే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు. అయితే ఇప్పుడా పరిస్ధితి మారింది. స్మార్ట్ఫోన్ల శకం మొదలుకావడంతో ఇప్పుడు అన్ని మొబైల్‌తోనే. ఆర్ధిక కార్యకలాపాలకు కూడా స్మార్ట్ఫోన్లనే వినియోగిస్తుండటంతో దేశంలో స్టాక్ మార్కెట్లలో మదుపు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. అది కూడా కోట్లలలో కావడం విశేషం. భారతదేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లకు చేరిందని నిపుణులు తెలిపారు. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్ చేసింది.. కోవిడ్‌కు ముందు ఈ సంఖ్య కేవలం 41 మిలియన్ల లోపుగానే వుందట.
లాక్డౌన్ కలిసొచ్చింది :
డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) , సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్ఎల్) ఈ మేరకు తాజా గణాంకాలు విడుదల చేశాయి. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంటి పట్టునే వుండటం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఖాళీ సమయం దొరకడంతో స్టాక్ మార్కెట్లపై అవగాహన పెంచుకునేందుకు సమయం దొరికింది. ఇది డీమ్యాట్ ఖాతాలు పెరగడానికి కారణమయ్యాయి. ఏప్రిల్ 2020లో రూ.174 లక్షల కోట్లుగా వున్న ఎన్ఎస్డీఎల్ కస్టడీలోని ఆస్తుల విలువ 2022 ఆగస్ట్ నాటికి రూ.320 లక్షలకు కోట్లకు చేరింది.
ఖాతాల సంఖ్యలో సీడీఎస్ఎల్.. ఆస్తులలో ఎన్ఎస్డీఎల్ :
డీమ్యాట్ ఖాతాల విషయంలో సీడీఎస్ఎల్ ముందంజలో వుంది. అయితే ఆస్తుల విషయంలో మాత్రం ఎన్ఎస్డీఎల్ అగ్రస్థానంలో వుంది. 6 నుంచి 7 కోట్ల మంది మదుపర్లకు డీమ్యాట్ ఖాతాలు వుండి వుండొచ్చని అంచనా. దీనిని బట్టి ఈక్విటీ మార్కెట్లు దేశంలో కేవలం 6 శాతం మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లతో పాటు.. మ్యూచువల్ ఫండ్లు, ఎల్ఐసీ, ఫింఛను ఫండ్ల వంటి వాటిలోనూ పొదుపు చేస్తున్నారు.