ఎర్రకోట ఘటన: దీప్ సిద్దూ అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబ్ ప్రముఖ నటుడు, గాయకుడు, యాక్టివిస్టు దీప్ సిద్ధూను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ఆందోళనతో ఢిల్లీ అట్టుడికిన విషయం తెలిసిందే. పోలీసు ఆంక్షలను దాటి ఎర్రకోటను వ్యూహాత్మకంగా ముట్టడించారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ రైతు మరణించాడు. పలువురు రైతులు గాయపడ్డారు. మరోవైపు పోలీసులు సైతం గాయపడ్డారు. అయితే ఎర్రకోట వేదికగా జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన దీప్ సిద్ధూను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
రైతులను ఎర్రకోట వైపు నడిపించడంతో పాటు ఎర్రకోటపై మత పరమైన జెండా ఎగురవేయడం వరకూ దీప్ సిద్దూ ముందుండి నడిపించారని ఆరోపణలు వినిపించాయి. అల్లర్లకూ సిద్దూనే బాధ్యుడని రైతు సంఘాలు సైతం ఆరోపించాయి. అప్పటి నుంచి సిద్దూ కనిపించకుండా పోయారు. దీప్ సిద్దూతో పాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్‌లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రకోట వద్ద జెండాలు ఎగురవేసిన దీప్ సిద్దూ, జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్ ఆచూకీ చెబితే రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు. పది రోజులకు పైగా పోలీసులకు దొరక్కుండా మాయమైన దీప్ సిద్దూ ఎట్టకేలకు నేడు పోలీసులకు పట్టుబడ్డాడు.
ఈ కేసును బీకే సింగ్ నేతృత్వంలో డీసీపీలు జాయ్ టుర్కీ, భేషంసింగ్, మోనికా భరద్వాజ్‌లు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దీప్ సిద్ధూ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ పోస్టులను దీప్ సిద్దూ తరుఫున విదేశాల్లో ఉంటున్న ఆయన స్నేహితురాలు ఒకరు పోస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులే స్వయంగా వెల్లడించారు. దీప్ సిద్దూ వీడియోలు పంపిస్తే ఆమె వాటిని పోస్టు చేస్తోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments