Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. మధ్యంతర బెయిల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో అరెస్టైన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. తిరిగి జూన్ 2న లొంగిపోవాలని సూచించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 20వరకు పొడిగించింది. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాడీవేడీగా వాదనలు జరిగాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం చేసేందుకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈడీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రచారం చేసే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ బెయిల్ ఇస్తే సీఎంగా బాధ్యతలకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌కు స్పష్టం చేసింది. అంతేకాదు బెయిల్‌పై విడుదలైతే ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయరాదని సూచించింది.
ఇది అసాధారణ పరిస్థితి అని కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని.. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని ఓ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా ఆయనకు ప్రచారం చేసుకునేందుకు వీలుగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. దీంతో ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా.. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments