దేశంలో హడలెత్తిస్తోన్న కోవిడ్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మళ్లీ ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. అటు పలువురు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, కరీనా కపూర్, అమృతా అరోరా, మంచు మనోజ్, సౌరవ్ గంగూలి సహా పలువురు రాజకీయ నేతలకు సైతం వైరస్ సోకింది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేరారు. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చినట్లు ఆయన స్వయంగా చెప్పారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తమ కుటుంబంలో ఒకరికి, తన సిబ్బందిలో మరొకరికి పాజిటివ్‌గా తేలడంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తాను పరీక్షలు చేయించుకోగా కరోనా నెగెటివ్ వచ్చిందన్నారు. అయితే వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే ఉంటానని, కొద్దిరోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకుంటానని ప్రియాంక వెల్లడించారు.
ఢిల్లీలో గత వారం రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో… నగరంలో కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. థియేటర్లు, పార్కులు, బార్లు, పార్టీ మీటింగ్స్‌పై ఆంక్షలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధనల కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు కిలోమీటర్ల మేర బారులు తీరి కన్పించారు. ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉండటం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments