ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కీలక నిర్ణయం
- IndiaGlitz, [Monday,April 19 2021]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి(సోమవారం) నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్ ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది.
ఇప్పటికే ఢిల్లీలో వారాంతపు లాక్‌డౌన్ నడుస్తుండగా.. ఇకపై ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు ఉదయం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సందర్భంగా మాల్స్, జిమ్‌లు, ఆడిటోరియంలు మొదలైనవి పూర్తి స్థాయిలో మూసివేయనున్నారు. అయితే సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో నడపనున్నారు.
ప్రైవేటు సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పనిచేయాలనీ... ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలు యధాతథంగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వీకెండ్ మార్కెట్ల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు. కాగా.. ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 25,462 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 161 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30 శాతం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.