YCP Candidate Son:మా నాన్నను ఓడించండి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కుమారుడు పిలుపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సొంత కుటుంబాల్లోని సభ్యులే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అన్నాతమ్ముడు, అన్నాచెల్లి, భార్యభర్త ఇలా సొంత రక్తసంబంధీకులే పోటీలో నిలవడంతో అక్కడ విజయావకాశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వైసీపీ ఎంపీ అభ్యర్థి కుమారుడు ఏకంగా తన తండ్రిని ఓడించాలంటూ పోస్టర్లు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి కొడుకుల ఇంటి పోరుపై రాష్ట్రమంతా జోరుగా చర్చ జరుగుతోంది.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు బూడి రవికుమార్ తన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. 'కన్న కొడుకుకు న్యాయం చేయలేనివాడు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలడు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి' అని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాగా కొన్ని సంవత్సరాల నుంచి తండ్రి కుమారుడు మధ్య రాజకీయ పోరు నడుస్తోంది.
బూడి ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనకు ముందు మాడుగుల టికెట్ ప్రకటించిన సీఎం జగన్.. ఆ తర్వాత మళ్లీ ఆయన్ను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. దీంతో మాడుగుల అసెంబ్లీ స్థానం ఆయన రెండో భార్య కుమార్తె అనురాధకు కేటాయించారు. దీనిపై మొదటి భార్య కుమారుడు రవికుమార్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేయడానికి రవి.. నామినేషన్ వేస్తే విత్‌డ్రా చేసుకునేలా చేసి.. అప్పుడూ అనురాధనే పోటీ చేయించారు.
తాజాగా మాడుగుల టికెట్ కూడా ఆమెకే దక్కేలా చేయడంతో తండ్రి తీరుపై రగిలిపోతున్నారు. దీంతో మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఓ వైపు తండ్రిని ఓడించాలని ప్రకటించడం.. మరోవైపు సోదరిపై పోటీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కుటుంబ పోరు పోలింగ్ అయ్యే లోపు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments