ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ‘‘ఉగాది’’ కానుక.... డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ , ఎంతంటే..?

  • IndiaGlitz, [Wednesday,March 30 2022]

ఉగాది పర్వదినానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ) 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉండగా.. కేంద్రం తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతోన్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడం లక్షలాది మంది ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది.

ఈ పెంపు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనుంది.

కాగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు గతేడాది అక్టోబరులో దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచిన సంగతి తెలిసిందే. జులై 2021 నుంచే ఆ పెంపు వర్తిస్తుందని తెలిపింది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 జులైలోనే దాన్ని పునరద్ధరిండమే గాక, ఒకేసారి 11 శాతం పెంచింది.