అమ్మకు ‘ అందాల వరుడు’ కావాలంటూ కుమార్తె ప్రకటన.. కండిషన్స్ అప్లై!
- IndiaGlitz, [Friday,November 01 2019]
టైటిల్ చూడగానే ఇదేంటి.. కుమార్తెకు అందమైన వరుడు కావాలి.. ఆ వ్యక్తికి ఫలానా లక్షణాలుండాలి అని ప్రకటనలు ఇచ్చే తల్లిదండ్రులు చూశాం. కానీ ఇక్కడేంటి సీన్ రివర్స్ అయ్యిందని కాసింత కన్ఫూజన్‌గా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. తల్లికే వరుడు కావాలి..? అది కూడా కొన్ని కండిషన్స్‌తో కూడిన వరుడు కావాలని స్వయానా కుమార్తె ప్రకటన ఇచ్చింది. అసలు ఎవరీమె..? తల్లి కోసం ఎందుకిలా ప్రకటన చేసింది..? ఆ కుమార్తె పెట్టిన కండిషన్స్ ఏంటి..? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. జనాలు దాన్ని ఏ రేంజ్లో వాడేస్తున్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. అక్కడెక్కడో అమెరికాలో కొనాల్సినవి కూడా ఆన్లైన్లో కొని పడేస్తున్నారు.. అదీ ప్రస్తుతమున్న టెక్నాలజీకి ఉన్న రేంజ్. అయితే ఈ టెక్నాలజీని కొందరు పనికొచ్చే మంచిపనులకు వాడుతుంటే.. ఎక్కువశాతం చిల్లర పనులకు వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఇదిగో ఈ యువతి ఇచ్చిన ప్రకటనను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. టెక్నాలజీతో ఎలాంటి మార్పులు వచ్చాయనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆస్థా వర్మ అనే అమ్మాయి తన తల్లికి వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. అది కూడా ఏ టీవీ చానెల్‌లోనో.. వార్తా పత్రికలోనే.. మ్యాట్రీమెనీలోనో కాదండోయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనతో పాటు కండిషన్స్ అప్లై అంటూ కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది ఆస్థా.
కండిషన్స్ ఇవీ...!
మా తల్లికి 50 ఏళ్ల అందమైన వరుడు కావాలి
కాబోయే వరుడు శాకాహారి అయ్యుండాలి
మద్యం అలవాటు ఉండకూడదు
జీవితంలో స్థిరపడిన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాం
ప్రకటనకు అసలు కారణమిదీ!
ఈ ప్రకటన ఇవ్వడానికి అసలు కారణం ఏమిటంటే.. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి తోడు ఎవరుంటారన్న ఆలోచన రాగానే ఈ ప్రకటన ఇచ్చానని ట్విట్టర్లో రాసుకొచ్చింది. కాగా.. ట్విట్టర్లో ఆస్థా ఇచ్చిన మ్యాట్రిమొనీ ప్రకటనకు విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి అందాల వరుడు ఎప్పుడు దొరుకుతాడో..? ఎప్పుడు ఆస్థానా పెళ్లి చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.