కోడెల మరణంపై కుమార్తె చెప్పిన నిజాలివీ..
- IndiaGlitz, [Monday,September 16 2019]
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? అసలు కోడెల ఎలా మరణించారు..? ఆత్మహత్య సమయంలో ఇంట్లో ఎవరెవరున్నారు..? ఆత్మహత్యపై డాక్టర్ల రిపోర్టులో ఏముంది..? ఇవాళ అల్పాహారం స్వీకరించిన ఆయన ఆ తర్వాత ఏం చేశారు..? బెడ్ రూమ్‌లోకి వెళ్లి డోర్స్ ఎందుకు వేసుకున్నారు..? భార్య ఎంత తలుపులు తట్టినా ఎందుకు ఓపెన్ చేయలేదు..?.. అసలు కేన్సర్ ఆస్పత్రికి ఎందుకు తరలించారు..? ఆత్మహత్యకు ముందు కోడెల సూసైడ్ లేఖ రాశారా..? ఆ లేఖ ఎక్కడుంది..? అందులో ఏముంది..? కోడెల ఆత్మహత్యకు ఇంటి సమస్యలే కారణమా..? కొడుకుతో గొడవలు ఈ తీవ్ర నిర్ణయానికి దారితీశాయా..? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
విజయలక్ష్మి నిజానిజాలివీ!
అయితే.. ఈ ప్రశ్నలన్నింటికీ కోడెల కుమార్తె విజయలక్ష్మీ సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె కీలక వివరాలు తెలిపారు. ఆమె మాటలన్నీ పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ‘మా తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. సోమవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత 11 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆయన గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికీ బయటకి రాకపోయేసరికి అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించారు. గన్‌మ్యాన్, డ్రైవర్ సాయంతో నాన్నను బసవతారకం ఆస్పత్రికి తరలించాము. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదు. గత రాత్రి ఇంట్లో ఎలాంటి గొడవా జరగలేదు..?’ అని ఆమె చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలుంటాయో తెలియాల్సి ఉంది మరి. ఇన్ని విషయాలు చెప్పిన ఆమె.. కేన్సర్ ఆస్పత్రికి ఎందుకు తరలించారన్న దానిపై మాత్రం సమాధానం కాదు కదా.. కనీసం స్పందించకపోవడం గమనార్హం.