ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. వారికే పదవులు!
- IndiaGlitz, [Monday,July 20 2020]
ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రి వర్గ విస్తరణపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు తెర దించుతూ ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి స్థానాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది.
కాగా.. సుభాష్ చంద్రబోస్, మోపిదేవి స్థానాలను వారి సామాజిక వర్గానికి చెందిన వారితోనే భర్తీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ శెట్టి బలిజ సామాజిక వర్గం కాగా.. మోపిదేవి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. కాబట్టి తూర్పు గోదావరి జిల్లా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ సభ్యుల పేర్లను మంగళవారం అధికారికంగా ప్రభుత్వం వెల్లడించనుంది.