మరోసారి తెరపైకి ‘డేటాచోరీ కేసు’.. ఇదే నిజమైతే..!

  • IndiaGlitz, [Monday,April 15 2019]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘డేటాచోరీ కేసు’ ఎన్నికల అనంతరం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆధార్ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆధార్ అధికారులు ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అధికారులు ఫిర్యాదు చేశారు. ఆధార్ చట్టం సెక్షన్ 37,38 ఏ,బీ, జీ, 40,42,44 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే.. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు సిట్ అధికారులు పంపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు తేల్చిచెప్పారు.

ఇదిలా ఉంటే.. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కుమార్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపించినప్పటికీ అశోక్ స్పందించలేదు. అశోక్‌తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే అశోక్‌ను అరెస్ట్ చేస్తే ఈ డేటాచోరీకి కర్త, కర్మ, క్రియ ఎవరనే విషయాలు బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని సిట్ భావిస్తోంది. ఇదేగానీ నిజమైతే 2014-19వరకు ఏపీని పాలించిన టీడీపీకి ఎనలేని కష్టాలేనని విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు మనుషుల నుంచి బెదిరింపులు..!

మరోవైపు.. హైదరాబాద్‌కు చెందిన ఓ రవాణా వ్యాపారి రవికాంత్.. తనకు టీడీపీ అధినేత చంద్రబాబు మనుషుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ ఫండ్‌గా ఎనిమిది కోట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారట. చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, ఆయన అధికారిక నివాసం ల్యాండ్‌లైన్‌ నుంచే ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారంలోపు తాము డిమాండ్‌ చేసిన రూ.8 కోట్లు చెల్లించకపోతే కుటుంబంతో సహా హతమారుస్తామంటూ బెదిరిస్తున్నారని ఆ వ్యాపారీ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో టీడీపీకి చెందిన ఈయనను ఆ పార్టీవారే బెదిరిస్తున్నారంటూ కేసు నమోదు కావడం గమనార్హం. అయితే ఇందులో నిజానిజాలేంటో తేల్చేపనిలో పంజాగుట్ట పోలీసులు నిమగ్నమయ్యారు.