Dasoju Sravan- Swamy Goud : బీజేపీ ఆకర్ష్‌కు టీఆర్ఎస్ వికర్ష్... సొంతగూటికి స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
- IndiaGlitz, [Saturday,October 22 2022]
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్- బీజేపీలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు మైండ్ గేమ్‌ను స్టార్ట్ చేశాయి. రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీశాయి. దీనిలో భాగంగా బీజేపీ నేతలు దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చకున్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
బీజేపీలో కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత:
అంతకుముందు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు స్వామిగౌడ్. అనంతరం బీజేపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన రాజీనామా లేఖ పంపారు. భారతీయ జనతా పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో స్వామిగౌడ్ తెలిపారు. పార్టీలో ధనికులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల కోసం శ్రమిస్తున్న వెనుకబడిన వర్గాల నేతలను, కార్యకర్తలను విస్మరిస్తున్నారని.. పలు సందర్భాల్లో బలహీన వర్గాల నేతలకు అవమానాలు జరుగుతున్నాయని స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో స్వామిగౌడ్:
కాగా... తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి వుండి... కీలకపాత్ర పోషించారు స్వామిగౌడ్. ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడే ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై.. తెలంగాణ శాసనమండలి తొలి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2020 వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలోని కీలక నేతల్లో ఒకరిగా వున్న ఆయన.. అనూహ్య పరిణామాల మధ్య టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు.
పీఆర్పీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో పనిచేసిన దాసోజు శ్రవణ్:
ఇక దాసోజు శ్రవణ్ విషయానికి వస్తే... మంచి వక్త, ఉన్నత విద్యావంతుడైన ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో చిరు సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో పీఆర్‌పీకి గుడ్ బై చెప్పి... టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్లో ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా టీఆర్ఎస్‌పై విరుచుకుపడేవారు. ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వడం, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డికి ఖైరతాబాద్ స్థానం ఇస్తారనే ప్రచారం జరుగుతూ వుండటంతో తనకు టికెట్ దక్కదన్న ఉద్దేశంతో దాసోజు శ్రవణ్ రెండు నెలల క్రితం బీజేపీలో చేరారు. తాజాగా భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చకపోవడంతో... కమలాన్ని వీడి కారెక్కి తన సొంతగూటికి చేరుకున్నారు .