తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దాసరి సంస్మరణ సభ!!

  • IndiaGlitz, [Saturday,June 10 2017]

తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఫిలిం ఫెడ‌రెష‌న్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు సి. క‌ల్యాణ్ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్ రామానాయుడు క‌ళా మండ‌పంలో ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు సంస్మ‌ర‌ణ స‌భ‌ను ఏర్పాటు చేశారు.
ఈ సంద‌ర్భంగా ఛాంబ‌ర్ త‌రుపున నిర్మాత డి.సురేష్ బాబు, దామో ద‌ర్ ప్ర‌సాద్, ఎఫ్ న్ సీసీ త‌రుపున కె.ఎస్ రామారావు, తెలుగు ఫిలిం కార్మిక స‌మాఖ్య త‌రుపున దొర‌, కొమ‌ర వెంక‌టేష్‌, ఫిలిం న‌గ‌ర్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సోసైటీ త‌రుపున ఉపాధ్య‌క్షుడు కాజా సూర్య‌నారాయ‌ణ సంతాపాల‌ను తెలియ‌జేశారు. అలాగే ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు చిరంజీవి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, డి. సురేష్ బాబు, నిర్మాత అల్లు అర‌వింద్ దాసరికి అశ్రు నివాళులు అర్పించారు.
ఈ సంద‌ర్బంగా చిరంజీవి మాట్లాడుతూ, ' విదేశాల‌లో ఉండ‌టం వ‌ల్ల దాస‌రి గారి క‌డ‌సారి చూపుకు నోచుకోలేక‌పోయాను. ఇది నా జీవితాంతం గుర్తిండ‌పోయే అసంతృప్తి. ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు ఖైదీ నంబ‌ర్ 150వ సినిమా స్కోర్ ఎంత అని ఎంతో ఉత్సాహంగా అడిగారు. ఆ సంఘ‌ట‌న ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండి పోతుంది. చివ‌రిసారిగా దాస‌రి గారి పుట్టిన రోజున ఇంటికెళ్లి క‌లిసాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న ప‌క్క‌నే కూర్చుని చాలా సేపు మాట్లాడాను. నా చేతుల మీదుగానే అల్లు రామ‌లింగ‌య్య అవార్డును అందించాను. ఒక‌సారి ఆయ‌న ఇంటికెళ్లిన‌ప్పుడు భోజనం చేసే వ‌ర‌కూ తిరిగి వెళ్ల‌నివ్వ‌లేదు. ఆ స‌మ‌యంలో నాకు పితృవాత్సల్యం చూపించారు. ఆయ‌న‌తో క‌లిసి ఎన్నో సినిమాలు చేశాను. అలాంటి వ్య‌క్తి ఆశీస్సులు నాకు ఎప్ప‌టికీ ఉంటాయి. ఇక సినీ కార్మికులు కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డ్డ వ్య‌క్తి. ఆయ‌న లేక కార్మికులంతా అనాధులైపోయారు. త‌ర్వాత ఆస్థానం ఎవ‌రిది అంటే అదొక క్వ‌శ్చ‌న్ మార్క్. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా. మ‌న‌స్పూర్తిగా ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా' అని అన్నారు.
గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ' దాస‌రి గారికి సంబంధించి ఇలాంటి కార్య‌క్ర‌మానికి హజ‌ర‌వుతాన‌ని ఊహించ‌లేదు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న ఎన‌లేని సేవ‌లందించారు. ద‌ర్శ‌కుడిగా..న‌టుడిగా...నిర్మాత‌గా..ర‌చ‌యిత‌గా ఆయ‌న ప్ర‌తిభ ఏంటో అంద‌రికీ తెలుసు. ఆయ‌నొక ఆల్ ఇన్ వ‌న్' అని అన్నారు.
డి. సురేష్ బాబు మాట్లాడుతూ, ' దాస‌రి గారు గొప్ప ద‌ర్శ‌కులు. 151 సినిమాలు చేసిన ఏకైక వ్య‌క్తి. ఇటు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ కు ఎన్నో సేవ‌లందించారు. అలాంటి వ్య‌క్తి మ‌న మ‌ధ్య‌న లేక‌పోవ‌డం బాధాక‌రం. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టిస్తున్నా' అని అన్నారు.
అల్లు అర‌వింద్ మాట్లాడుతూ, ' మా కుటుంబ స‌భ్యులంతా విదేశాల్లో ఉండ‌టం వ‌ల్ల దాస‌రి గారి క‌డ‌చూపుకు నోచుకోలేకపోవ‌డం మా దుర‌దృష్ట క‌రం. చెన్నైలో ఉన్న‌ప్ప‌టి నుంచి దాస‌రి గారితో ప‌రిచ‌యం ఉంది. నేను సినీ ప‌రిశ్ర‌మ‌కు రావాల‌ని బాగా ప్రోత్సహించిన వ్య‌క్తి. మా బ్యాన‌ర్ లో వ‌రుస‌గా రెండు సినిమాలు చేసి విజ‌యాలు అందించారు. అప్ప‌టి నుంచి మా సంస్థ‌లో తెర‌కెక్కిన సినిమాలు మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. ఇక సినిమా ఇండ‌స్ర్టీలో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా ముందుకొచ్చి ప‌రిష్క‌రించే వారు. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ లో కీల‌క‌మైన వ్య‌క్తి ఆయ‌న‌. ఇటు సినిమాలు, అటు ఛాంబ‌ర్ వ్వ‌వ‌హారాలు ..మ‌రొప‌క్క 24 శాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ ఒక వార‌ధిలా పనిచేసే వారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ వెళ్లి దాస‌రి గారి ఇంటి త‌లుపు త‌డ‌తారు. ఆలాంటి వ్య‌క్తి ఈరోజు మ‌న మ‌ధ్య‌న లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న స్థానాన్ని మ‌రొక‌రు భ‌ర్తీ చేయ‌లేరు. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నా' అని అన్నారు.
ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ, ' దాసరి గారి గురించి చెప్పాలంటే తెలుగు అక్ష‌రాలు స‌రిపోవు. ఆయ‌న‌తో క‌ల‌సి రెండు సినిమాల‌కు ప‌నిచేశాను. చిన్న పెద్ద అనే తార‌త‌మ్యం లేకుండా అంద‌ర్నీ స‌మానంగా చూసే వ్య‌క్తి ఆయ‌నొక్క‌రే. మ‌ళ్లీ దాస‌రి లాంటి వ్య‌క్తి పుట్టాలి. సినీ ప‌రిశ్ర‌మ‌కు సేవ చేయాలి' అని అన్నారు.
ఆర్. నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ , ' గురువుగారు మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆయ‌న ఆశ‌యాలతో మ‌న‌మంతా ముందుకు వెళ్లాలి. అలాగే చ‌నిపోయిన త‌ర్వాత భార‌త‌ర‌త్న అవార్డుతో ఎలా గౌర‌విస్తున్నారో... దాస‌రి గారిని కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌర‌వించాల‌ని ప్ర‌భుత్వానికి విన్న‌పించుకుంటున్నా. తెలంగాణ‌, ఏపీ రాష్ర్టాలు దాస‌రి గారికి అవార్డు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.
ఇంకా దామోద‌ర్ ప్ర‌సాద్, బూరుగు ప‌ల్లి శివ‌రామ‌కృష్ణ‌, అశోక్ కుమార్, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, వేణు మాధ‌వ్, భీమనేని శ్రీనివాస‌రావు, కాజా సూర్య‌నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, విజ‌య్ చంద‌ర్, ఆది శేష గిరిరావు, స‌త్యానంద్ , హేమ‌, హ‌రినాథ్ , ఎల్.బి శ్రీరాం త‌దిత‌రులు దాస‌రి కి అశ్రు నివాళులు అర్పించారు.