TS Dasara Holidays : తెలంగాణలో 14 రోజుల పాటు దసరా సెలవులు.. తగ్గించాలంటూ ప్రతిపాదనలు, విద్యాశాఖ క్లారిటీ
- IndiaGlitz, [Wednesday,September 21 2022]
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇన్ని రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంపై నిపుణులు, మేధావుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదనలు చేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దసరా సెలవుల తగ్గింపు వార్తలపై విద్యాశాఖ క్లారిటీ :
దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించినట్లుగా వార్తాల సారాంశం. జూలై మాసంలో వర్షాలలతో పాటు సెప్టెంబర్‌లోనూ పలుమార్లు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పనిదినాలు ఏడు రోజుల వరకు తగ్గాయని.. అందువల్ల వాటిని భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఒకవేళ కుదరని పక్షంలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని మర ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే సెలవుల కుదింపులపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు:
ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దసరా సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. అలాగే క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది విద్యా శాఖ.