Darshakudu Review
దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ అంతటితో ఆగకుండా నిర్మాతగా మారాడు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేసి తన టీమ్‌ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ముందుగా వచ్చిన సినిమా కుమారి 21 ఎఫ్. ఈ సినిమా సక్సెస్ తర్వాత సుకుమార్ నిర్మాతగా చేసిన మరో ప్రయత్నమే `దర్శకుడు` చిత్రం. ఈ చిత్రంతో సుకుమార్ తన స్నేహితుడు హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేశాడు. మరి సుకుమార్ తన రెండవ ప్రయత్నంలో ఎంత మేర విజయం సాధించాడు? హరి ప్రసాద్ జక్కా దర్శకుడుగా సక్సెస్ అయ్యాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
చిన్నప్పట్నుంచి దర్శకుడు కావలనుకునే కుర్రాడు మహేష్ (అశోక్). సినిమాలంటే మహేష్‌కున్న ఆసక్తిని చూసి అతని తండ్రి కూడా ఎంకరేజ్ చేస్తాడు. సినిమా దర్శకుడు కావాలనుకున్న అశోక్ ముందు రెండేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తాడు. తనలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ కథనే సినిమాగా తీయాలని కథను సిద్ధం చేసుకుని నిర్మాతకు కథ చెబుతాడు. కథ బావున్నా, లవ్ ట్రాక్ ఇంకా బావుండాలని నిర్మాత చెప్పి, అశోక్‌కు పదిహేను రోజులు సమయం ఇస్తాడు. లవ్ ట్రాక్ గురించి ఆలోచిస్తూ అశోక్ తన ఊరెళతాడు. అక్కడి తిరిగి వచ్చేటప్పుడు నమ్రత(ఈషారెబ్బా) పరిచయం అవుతుంది. మార్గమధ్యంలో మహేష్ అంటే నమ్రతకు ప్రేమ పుడుతుంది. కానీ మహేష్ ప్రతి విషయాన్ని ఎమోషనల్‌గా కాకుండా సినిమా యాంగిల్‌లోనే ఆలోచిస్తుంటాడు. దాంతో మహేష్, నమ్రతల మధ్య గొడవ జరుగుతుంది. చివరకు నమ్రత ఫ్రెండ్(పూజిత)ను హీరోయిన్‌గా పెట్టి సినిమా స్టార్ట్ చేస్తాడు. పూజితకు ఫ్యాషన్ డిజైనర్‌గా నమ్రతనే తీసుకుంటాడు. సినిమా అయిపోయే సమయంలో మహేష్ అంటే నమ్రతకు ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. కానీ అనుకోకుండా కథ మలుపు తిరుగుతుంది. మహేష్ కనిపించకుండా మాయమైపోతాడు. ఆ మలుపేంటి? అసలు మహేష్ ఎక్కడికి వెళతాడు? మహేష్, నమ్రతలు ఒక్కటయ్యారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు హరిప్రసాద్ కథలో ప్రతి సన్నివేశాన్ని ఫ్రెష్ ఫీలింగ్‌తో చెప్పడానికి ప్రయత్నించాడు. సినిమాలంటే ప్యాషన్ ఉండే కుర్రాడు ఏం చేశాడనే కథలో హీరో క్యారెక్టర్‌ను హరిప్రసాద్ డిజైన్ చేసిన తీరు బావుంది. జీవితంలో ప్రతి విషయాన్ని సినిమాతో హీరో ముడిపెట్టి ఎలా ఆలోచిస్తాడు అనే విషయాలను చక్కగా చూపించాడు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సింపులగా బావుంది. హీరో తన లవ్ ట్రాక్‌ను సినిమా చూపించాలనుకునే పద్ధతి, ఈషా రెబ్బా నటన బావున్నాయి. కొన్ని సన్నివేశాల్లో సెంటిమెంట్ ఆకట్టుకుంది. సుదర్శన్, ప్రియదర్శిన్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. సాయికార్తీక్ మ్యూజిక్ బావుంది. ఆకాశం దించి మేఘాలతో సెట్ వేస్తా, నీ మనసింతేనా సాంగ్, హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్చువేషన్ సాంగ్ ఇలా పాటలన్నీ బావున్నాయి. ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ప్రతి సీన్‌ను ప్రవీణ్ చక్కగా ఎలివేట్ చేశాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బావుంది. డైరెక్టర్ అంటే 20 శాతం క్రియేటివిటీ, 80 శాతం మేనేజ్‌మెంట్, దర్శకుడి ఐడెంటియే సినిమా, ప్యాషన్ అంటే తపస్సు, సినిమా అంటే చిన్న చూపుగా మాట్లాడేవారికి సినిమా విలువను చెప్పే సందర్భంలో డైలాగ్స్ బావున్నాయి.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు రాసుకున్న ఎమోషన్‌ను హీరో అశోక్ సరిగ్గా తెరపై ప్రెజంట్ చేయలేకపోయాడు. ఓ దర్శకుడి మానసిక సంఘర్షణ సమయంలో ఎక్స్‌ప్రెషన్స్, సాధారణ సన్నివేశంలో ఎక్స్‌ప్రెషన్స్ ఒకేలానే ఉన్నాయి. అయితే డెబ్యూ హీరో కాబట్టి అశోక్ నుండి గొప్ప నటనను ఆశించడం తప్పే అవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్‌ను సాగదీసినట్టు అనిపించింది. సుదరశన్, ప్రియదర్శి కామెడితో నవ్వించే ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు.
సమీక్ష:
సాధారణంగా ప్రేమకథ అంటే హీరో హీరోయిన్ ముందు గొడవపడటం, తర్వాత ప్రేమలో పడటం అనే అంశాలు కామన్‌గానే ఉంటాయి. దర్శకుడు హరిప్రసాద్ ఇలాంటి ప్రేమ కథనే ఫ్రెష్ ఫీల్‌తో చెప్పడానికి ప్రయత్నించాడు. సన్నివేశాల పరంగానే కామెడి కనపడుతుంది. కామెడి అంటూ విరగబడేంత కూడా ఎక్కడా ఉండదు. మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈషా ఎమోషన్స్ లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. అశోక్ పరావాలేదనిపించాడు. ఇంకాస్తా పరిణితి అవసరం అనిపించింది.
బోటమ్ లైన్: దర్శకుడు... కొత్త ప్రయత్నం
Darshakudu Movie Review in English
- Read in English