Darbar Review
సూపర్‌స్టార్ రజినీకాంత్ ... నాలుగు దశాబ్దాలుగా తనదైన స్టైల్‌తో ప్రేక్షకులు అలరిస్తున్న కథానాయకుడు. అయితే ఆయన ఇమేజ్‌కు తగిన హిట్ వచ్చిన కాలమే అయ్యిందనాలి. రోబో తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ ఆదరణను పొందలేకపోయాయి. ఈ తరుణంలో డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్‌తో రజినీ చేసిన సినిమాయే దర్బార్. మురుగదాస్ సినిమాలకు తెలుగులో అభిమానులుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ నటించి చాలా కాలమైంది. అలాంటి ఓ పవర్‌ఫుల్ ఆఫీసర్ కథతో రజినీకాంత్‌ను చూడాలనుకుంటే ఎలా ఉంటుందో చెప్పేదే దర్బార్ చిత్రం.. ముందు కథలోకి వెళదాం...
కథ:
ముంబై కమీషనర్ ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) స్ట్రిట్ ఆఫీసర్. ఒకే రోజు 13 మందిని ఎన్‌కౌంటర్ చేసేస్తాడు. దాంతో ముంబైలోని దాదాలందరూ భయపడుతుంటారు. తనపై చర్యలు తీసుకోడానికి వచ్చిన మానవ హక్కుల కమీషన్ ఆఫీసర్‌ను కూడా బెదిరిస్తాడు. కథ అక్కడ నుండి గతంలోకి వెళుతుంది. ఢిల్లీ నుండి స్పెషల్ ఆర్డర్ మీద ముంబై వస్తాడు ఆదిత్య అరుణాచలం. రాగానే అక్కడున్న డ్రగ్ రాకెట్, హ్యుమన్ ట్రాఫికింగ్‌ను నిరోధిస్తాడు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తుందొక ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ మల్హోత్రా(నవాబ్ షా) తనయుడు అజయ్ మల్హోత్రా(ప్రతీక్ బబ్బర్) అని తెలుస్తుంది. దాంతో అతన్ని అరెస్ట్ చేసి జీవిత ఖైదు శిక్ష పడేలా చేస్తాడు. ధనబలం ఉన్న వినోద్ మల్హోత్రా ఆదిత్యను మోసం చేయడానికి ఓ ప్లాన్ వేస్తాడు. కానీ దాన్ని పసిగట్టిన ఆదిత్య అరుణాచలం ఎలాంటి చర్యలు తీసుకుంటాడు? పర్యావసానంగా అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అసలు అజయ్ మల్హోత్రా ఎవరు? ఆదిత్యను అంత చేయాలని విదేశాల నుండి వచ్చిన డాన్ హరి చోప్రా(సునీల్ శెట్టి)ని ఆదిత్య అరుణాచలం ఏం చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
ఒక మహానగరం అక్కడ విలన్ అరాచకాలు..వాటికి అక్కడకొచ్చిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా అడ్డుకట్ట వేశాడు అనే కథాంశంతో చాలా సినిమాలే వచ్చాయి. ఇప్పుడు రజినీకాంత్, మురుగదాస్ `దర్బార్`గురించి సింపుల్‌గా చెప్పాలంటే అంతే.. అయితే ఇలాంటి కథాంశాలకు స్క్రీన్ ప్లే కీలకంగా ఉంటుంది. సన్నివేశాలను దర్శకుడు ఎంత ఆసక్తికరంగా మలిచాడనేదే ముఖ్యం. మురుగదాస్ అలాంటి ఓ స్క్రీన్‌ప్లేను దర్బార్ సినిమాలో చూడొచ్చు. అప్పుడెప్పుడో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రజినీకాంత్ చాలా కాలం తర్వాత మరోసారి అలాంటి పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ మూవీ, అందులోని రజినీకాంత్‌లాంటి హీరో ఇక మురుగదాస్ ఊరుకుంటాడా? తనదైన శైలిలో సినిమాను కమర్షియల్ ఫార్మేట్‌లో ఆసక్తికరమైన అంశాలతో ఆకట్టుకునేలా మలిచాడు. రజినీకాంత్ తనదైన స్టైల్లో నటించాడు. సినిమా ఆసాంతాన్ని ముందుండి నడిపించాడు. ఫస్టాప్ అంతా పోలీస్ ఆఫీసర్‌గా విలన్స్‌ను హీరో ఆడుకున్నాడనే అంశాలలు ఆసక్తిని రేపితే.. హీరో లవ్ ట్రాక్ కామెడీని పంచుతుంది. ఇక సెకండాప్ సెంటిమెంట్, మళ్లీ హీరో, విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. నయనతార, నివేదా థామస్‌లు వారి పాత్రల పరిధుల మేరకు చక్కగా నటించారు. మెయిన్ విలన్‌గా నటించిన సునీల్ శెట్టి సెకండాఫ్‌లో ఎంట్రీ ఉంటుంది. దాని కంటే ముందు నవాబ్ షా, యోగిబాబు, శ్రీమాన్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
హీరో ఇంట్రడక్షన్ ఫైట్ చాలా బావుంది. ఇక హీరో డ్రగ్ రాకెట్‌ను అంతం చేసే క్రమంలో ప్రతీక్ బబ్బర్‌ను అరెస్ట్ చేయడం.. దాన్ని విలన్ అడ్డుకోవాలని పథకాలు వేస్తూ వస్తే.. హీరో తెలివిగా తన చర్యలతో ఎలా చిత్తు చేస్తాడనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక సినిమా సెకండాఫ్‌లో నివేదా, రజినీ మధ్య సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక రైల్వే స్టేషన్‌లో వచ్చే ఫైట్ బావుంది. ఇక మెయిన్ విలన్ ఎంట్రీ తర్వాత అతను పోలీసులను భయపెట్టాలనుకోవడం.. కనపడకుండా ఉంటున్న విలన్‌ని హీరో ఎలా పసిగట్టాడు? ఎలా అంతం చేశాడనేదే సినిమా.
సాంకేతికంగా చూస్తే మురుగదాస్ తనదైన శైలిలో సన్నివేశాలను ఆద్యంతం ఆసక్తికరంగా, అభిమానులు మెచ్చేలా డిజైన్ చేశాడు. ఈ సన్నివేశాలకు అనిరుధ్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. తమిళంలో పాటలు బావున్నాయి. కానీ.. తెలుగులో పాటలు ఆకట్టుకోవు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. యాక్షన్ సీన్స్‌కు అనిరుధ్ మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సంతోశ్ శివన్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎడిటింగ్ బావుంది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
బోటమ్ లైన్: దర్బార్.. రజినీ వన్ మ్యాన్ షో
Read Darbar Movie Review in English
- Read in English