KCR:ఎన్నికల్లో మళ్లీ తెరపైకి దళిత సీఎం నినాదం.. కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రశ్నల వర్షం..

  • IndiaGlitz, [Sunday,November 19 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం వాడివేడి జరుగుతోంది. పోలింగ్‌కు పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు నేతలు. మరోవైపు ఈ ఎన్నికల్లో దళిత సీఎం నినాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలపై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళిత సీఎం నినాదంపై తాము వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.

తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని తాను ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన మాట నిజమేనన్నారు. అయితే తొలిసారి తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లే వచ్చాయని గుర్తు చేశారు. దీంతో మెజార్టీ కన్నా కేవలం మూడు సీట్లే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాన్ని నడపలేరని అనేక మంది సలహాలు ఇచ్చారని తెలిపారు. దళిత సీఎం హామీపై తాము వెనక్కి తగ్గడం లేదని.. అందుకు సమయం రావాలని కేసీఆర్ వెల్లడించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.

2014 నుండి 2018 వరకు మీ పరిపాలన బాలేదని మీరు అంగీకరిస్తున్నారా? అందుకే 2018లో మీరు దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదా? 2018 నుండి 2023 వరకు మీ పరిపాలనపై మీకు నమ్మకం లేదా? ఈ తొమ్మిదేళ్లలో మీ పరిపాలన బాలేదు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని ఆకాంక్షిస్తున్నారా? దళితుడికి పరిపాలన చేసే అధికారం ఇవ్వడం మీకు ఇష్టం లేదా? దళితుడు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇప్పటివరకు కూడా ఎవరికి అర్హత లేదని మీరు భావిస్తున్నారా? మీ పరిపాలనలో ఏ దళిత నాయకుడు కూడా పరిపాలకుడిగా ఎదగలేదని మీరు భావిస్తున్నారా? మీ ఎమ్మెల్యే అభ్యర్థులలో దళిత అభ్యర్థులకు ఏ ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని మీరు ఇప్పటికీ భావిస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.

ముఖ్యమంత్రి అటుంచితే కనీసం దళితుడు ఉపముఖ్యమంత్రి ఉంటే.. ఆ పదవిని కూడా లేకుండా తీసేసి, ఇన్నేళ్ళు పరిపాలన చేశారు ఎందుకు? తెలంగాణ ప్రజలారా ఆలోచించండి దళితుడు ఉపముఖ్యమంత్రిగా ఉంటేనే సహించలేదు.. దళితుడు తన పక్కన కూర్చుంటేనే ఓర్చుకోలేని ఈ అహంకారపూరిత కేసీఆర్.. ఇక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడని మనం ఎలా ఆశిస్తాం. పదేండ్ల అహంకారం పోవాలంటే..! పదేండ్ల అవినీతిని తరమాలంటే..!! మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.