Daggubati Purandeswari:చంద్రబాబుకు రిమాండ్ : టీడీపీ బంద్‌కు బీజేపీ మద్ధతంటూ ఫేక్ లెటర్ .. పురందేశ్వరి సీరియస్
- IndiaGlitz, [Monday,September 11 2023]
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. అయితే టీడీపీ బంద్‌కు ఏపీ బీజేపీ మద్ధతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఓ నకిటీ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై పురందేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్‌కు మద్ధతు ఇచ్చినట్లుగా బీజేపీ లెటర్ హెడ్‌పై నా సంతకంతో ఒక నకిలీ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యూలేట్ అవుతోందని పురందేశ్వరి చెప్పారు. ఈ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పురందేశ్వరి వెల్లడించారు.
టీడీపీ బంద్‌కు జనసేన మద్ధతు :
మరోవైపు టీడీపీ రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన బంద్‌కు జనసేన సంఘీభావం ప్రకటిస్తోందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విపక్షాలను రాజకీయ కక్ష సాధింపుతో , కేసులతో, అరెస్ట్‌లతో వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అప్రజాస్వామిక చర్యలకు జనసేన వ్యతిరేకమని.. ఈ బంద్‌లో శాంతియుతంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు.
చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ :
కాగా.. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరగనున్నాయి. అటు చంద్రబాబుకు బెయిల్ సంపాదించేందుకు ఆయన లాయర్లు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.