జగన్ టికెట్ ఇచ్చినా దగ్గుబాటి పోటీ కష్టమే.. ఎందుకంటే..!?
- IndiaGlitz, [Sunday,January 27 2019]
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనుందని ఎప్పట్నుంచో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆ వార్తలు ఆదివారం మధ్యాహ్నంతో అక్షరాలా నిజమయ్యాయి. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తన కుమారుడు హితేశ్ చెంచురామ్‌తో కలిసి లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ అధినేత జగన్‌ను కలుసుకున్న సంగతి తెలిసిందే. మంచి రోజు చూసుకుని త్వరలోనే పార్టీలో చేరుతామని దగ్గుబాటి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే వైసీపీ టికెట్ ఇస్తే వెంకటేశ్వర్లు పోటీ చేస్తారా..? లేకుంటే హితేశ్ పోటీ చేస్తారా..? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
హితేశ్ పోటీ చేయడం కష్టమే..!
ప్రకాశంలోని పర్చూరు స్థానంపై దృష్టిసారించిన దగ్గుబాటి ఫ్యామిలీ తమ కుమారుడు హితేశ్ చెంచురాంను పోటీ చేయించాలని యోచిస్తోంది. అయితే జగన్‌తో జరిగిన భేటీలో పర్చూరు స్థానంపై హామీ వచ్చిందా..? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాబోయే ఏపీ ఎన్నికల్లో దగ్గుబాటి హితేశ్‌కు టికెట్ ఇచ్చినా పర్చూరు నుంచి హితేశ్ పోటీ చేయడం కష్టమేనని తెలుస్తోంది.
ఇదిగో కారణాలు..!
హితేశ్‌కు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉందన్న విషయం తెలిసిందే. విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడం నిబంధనల ప్రకారం కుదరదన్న విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం రద్దుకు హితేశ్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పౌరసత్వం రద్దయిన వెంటనే హితేశ్ తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వైసీపీలో చేరుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ నిర్ణీత సమయంలోగా పౌరసత్వం రద్దుకాకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హితేశ్ బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఇది కూడా హితేశ్‌ను పోటీ చేయించకపోవడానికి ఓ కారణమేనని తెలుస్తోంది. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం హితేశ్నే పోటీ చేయించాలని భావిస్తోంది.
మొత్తానికి చూస్తే.. పౌరసత్వానికి.. పర్చూరు నుంచి పోటీకి పెద్ద లింకే ఉంది. అమెరికా పౌరసత్వం రద్దుకు ఎప్పట్నుంచో హితేశ్ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ప్రకటన లోపు హితేశ్ అనుకున్నట్లు జరుగుతుందా..? అసలు హితేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్న దగ్గుబాటి ఫ్యామిలీ కోరిక నెరవేరుతుందా లేదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.