ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న భారీ తుఫాన్!

  • IndiaGlitz, [Monday,May 04 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విలయతాండవం చేస్తుండగా.. తాజాగా రాష్ట్రానికి మరో ముప్పు రాబోతోంది. ఏపీకి భారీ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఏపీతో పాటు తెలంగాణకు కూడా ముప్పేనని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు ఈ ముప్పు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా.. ఈ తుఫాన్‌కు ఎంఫాన్ (AMPHAN) గా వాతావరణ శాఖ నామకరణం చేసింది.

ఎలా వెళ్లనుంది..!?

పూర్తి వివరాల్లోకెళితే.. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. ఇది మరింత బలపడి సుమారుగా మే-07న ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మే-07 వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా.. రేపు అనగా.. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇదే జరిగితే..

ఇప్పటికే కరోనాతో ఏపీతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. వాస్తవానికి ఎండ ఎక్కువగా ఉంటే.. కరోనా వైరస్ చనిపోయే అవకాశాలు ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో భారీ ముప్పు ముంచుకొస్తోందటే అతలాకుతలమేనని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అసలే కరోనా.. ఆపై ఈ హెచ్చరికలు రాష్ట్ర ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తాయి. అయితే దీనిపై ఇంతవరకూ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

పిడుగు పాటు హెచ్చరిక..

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు పిడుగులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరించారు. జిల్లాలో జిల్లాలవారీగా పరిస్థితి ఎలా ఉండనుందో కమిషనర్ మాటల్లోనే విందాం.

శ్రీకాకుళం :- మెలియపుట్టి ,పాతపట్నం టెక్కలి, నందిగం ,పలాస , సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట.
విజయనగరం :- గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ ,దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం.
విశాఖ పట్నం :- అనంతగిరి,అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ.
గుంటూరు :- బొల్లపల్లి, వెల్దుర్తి , దుర్గి.
కర్నూలు :- ఆత్మకూరు, బండిఆత్మకూరు, కొత్తపల్లె , ఓర్వకల్, హాలహర్వి,చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కమిషనర్ మీడియాకు వెల్లడించారు.