Andhra:కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయంది. దీంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. ఉత్రరాంధ్ర, రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయింది.
సోమవారం పశ్చిమ గోదావరి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీ పొట్టిశ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామని.. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు వివరించారు.
ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నెంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్ చేయాలన్నారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారలు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు త్వరగా తీరానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments