VH Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను మోసం చేయబోయిన సైబర్ నేరగాళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీ.హన్మంతరావును మోసం చేయబోయారు. ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి, కాపునాడు సీనియర్ నేత హరిరామజోగయ్య పేరిట ఓ ఆగంతకుడు వీహెచ్‌కు కాల్ చేశాడు. తన ఆరోగ్యం బాలేదని.. మందుల కోసం గూగుల్ పే ద్వారా మూడు వేల రూపాయలు పంపాలని కోరాడు. గురువారం రాత్రి 7.30 గంటలకు 10.30 గంటల వరకు ఫోన్లు మీద ఫోన్లు చేశాడని వీహెచ్ తెలిపారు.
ఖమ్మం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా ట్రేస్ చేసిన పోలీసులు..
దీంతో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఫోన్ చేసి హరిరామ జోగయ్య ఇలా ఫోన్ చేశారని.. మందుల కోసం డబ్బులు అడిగారని తెలిపానని చెప్పారు. జోగయ్య డబ్బులు అడగడం ఏంటి.. ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు.. కాలేజీలు ఉన్నాయని హర్షకుమార్ తనకు తెలిపారని.. కానీ ఎందుకైనా మంచిది ఓసారి ఆయన ఇంటికి వెళ్లి కనుక్కోమని చెప్పానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ ఓ కుర్రాడికి ఐదు వేల రూపాయలు ఇచ్చి జోగయ్య ఇంటికి పంపించగా ఆయన తాను డబ్బులు అడగడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు. గతంలో కూడా మాజీ మంత్రి జానారెడ్డి, సుజనా చౌదరి పేర్ల మీద కూడా ఇలాగే డబ్బులు వసూలు చేశారని చెప్పినట్లు వివరించారు. వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. ఆయన ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి ఖమ్మం నుంచి మీకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారని.. ఖమ్మం ఎస్పీకి ఫిర్యాదు చేయమన్నారని వీహెచ్ వెల్లడించారు.
ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని.. తమ లాంటి రాజకీయ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని వీహెచ్ మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వాలు, అధికారులు స్పందించి సైబర్ క్రైమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తానని.. ప్రజలెవరూ ఇలాంటి కాల్స్‌కు స్పందించకండని ఆయన విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout