ఇకపై కొత్త చట్టంతో వస్తున్న సైబరాబాద్ పోలీస్.. తస్మాత్ జాగ్రత్
- IndiaGlitz, [Thursday,March 11 2021]
ఇప్పటి వరకూ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మందు బాబులు మాత్రం మద్యం సేవించి వాహనాలు నడపడం మానడం లేదు. ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినా పెద్ద సంఖ్యలో కార్లు, బైక్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు కొత్త చట్టాన్ని ఇకపై ప్రయోగించనున్నారు. ఇప్పటి వరకూ మద్యం తాగి వాహనం నడిపే వారిపైనే కేసులు నమోదు చేస్తున్నా పోలీసులు.. ఇకపై మరో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఓ కీలక విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
తాగిన వ్యక్తి నడిపే వాహనంలో ప్రయాణించే వారిపై కూడా కేసు పెట్టబోతున్నట్టు సైబరాబాద్ పోలీసులు ట్విటర్ వేదికగా వెల్లడించారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసీ ఆ వాహనంలో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని.. దీనికి సంబంధించి మోటారు వాహనాల చట్టంలోని 188వ సెక్షన్‌ను ప్రయోగించనున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ‘మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా? అయితే అతనితో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. తస్మాత్ జాగ్రత్త.. ఇకపై వాహనంలో ప్రయాణించడానికి ముందే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడో.. లేదో చెక్ చేసుకోవాలి.