ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి..
- IndiaGlitz, [Saturday,May 22 2021]
ఎయిర్ ఇండియాతో సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలపై భారీ సైబర్ దాడి జరిగింది. ప్రయాణికుల సేవల వ్యవస్థను అందిస్తున్న ‘ఎస్ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్ దాడులు జరగాయి. దీంతో కొంత మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు శుక్రవారం ఎయిర్ ఇండియా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఆయా సంస్థలకు చెందిన 45 లక్షల మంది యూజర్ల డేటా లీకైంది. ఎస్ఐటీఏ పీఎస్ఎస్ సర్వర్‌లో విమాన ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కాగా.. 2011 ఆగస్టు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్య విమాన ప్రయాణానికి పేర్లు రిజిస్టర్ చేసుకున్న డేటా లీకైంది.
ఇదీ చదవండి: నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి
ఆగస్టు 11, 2011 నుంచి ఫిబ్రవరి 3, 2021 మధ్య నమోదైన వ్యక్తిగత సమాచారంపై ఆ ప్రభావం పడినట్లు ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. స్టార్ అలయెన్స్‌తోపాటు ఎయిరిండియా ప్రయాణికుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పాస్‌పోర్ట్ వివరాలు, టిక్కెట్ సమాచారం లీక్ అయి ఉండొచ్చునని తెలుస్తోంది. ఇంకా మలేషియా ఎయిర్‌లైన్స్, ఫిన్నాయర్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, కథాయ్ పసిఫిక్ సంస్థల డేటా కూడా లీకైనట్టు సమాచారం. తాము, తమ డేటా ప్రాసెసర్ కలిసి పరిష్కార చర్యలు చేపడుతూనే ఉన్నామని... ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని కోరుతున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న డేటా లీక్ గురించి తొలుత సమాచారం అందుకున్నామని పేర్కొంది. ఏయే సమాచారం లీకైందన్న విషయమై మార్చి 25-ఏప్రిల్ 5 మధ్య గుర్తించామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిరిండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 45 లక్షల ప్రయాణికుల డేటా లీక్ అయినట్లు తెలిపింది. ఎస్ఐటీఏ అనేది స్విట్జర్లాండ్‌కు చెందిన కంపెనీ. ఫిబ్రవరి 2021 చివరి వారంలో ఆ సంస్థపై సైబర్ దాడి జరిగినట్లు ఎయిరిండియా తెలిపింది. ఏ స్థాయిలో జరిగిందనే అంశంపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని..ఆ దాడి తర్వాత కంపెనీ వ్యవస్థలో ఎటువంటి అనధికార కార్యకలాపాలు జరగలేదని ఎస్ఐటీఏ స్పష్టం చేసినట్లు వివరించింది.