ఫేస్‌బుక్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త..
- IndiaGlitz, [Wednesday,April 21 2021]
ఫేస్‌బుక్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎప్పటి నుంచో సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవలే ఫేస్‌బుక్ ఫ్లాట్‌ఫామ్‌లపై డేటా దాడి జరిగింది. దీనిలో 61 లక్షల భారతీయ అకౌంట్ల నుంచి డేటా చోరీకి గురైంది. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ వినియోగాదారులు తమ అకౌంట్‌కు సంబంధించిన ప్రైవేట్ సెట్టింగ్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. ఈ ఏజెన్సీ పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది.
నెటిజన్లు లేచిలేవగానే సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. అయితే తమ అకౌంట్ల ప్రైవేట్ సెట్టింగ్స్ విషయంలో మాత్రం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. అయితే ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ విస్తరిస్తున్నకొద్దీ యూజర్ల అకౌంట్లు బహిర్గతమయ్యే అవకాశాలు పెరుగుతాయని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. కనీసం యూజర్‌కు ఏమాత్రం అనుమానం కూడా రాకుండా వారి డేటా చోరీ జరిగిపోతుందని ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ ప్రొఫైల్ సమాచార లీకేజీ భారీగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపింది.
అయితే ఫేస్‌బుక్ నుంచి లీకయ్యే సమాచారంలో ఈమెయిల్ ఐడీలు, ప్రొఫైల్ ఐడీలు, పేర్లు, వృత్తి వివరాలు, ఫోన్ నంబర్లు, బర్త్‌డే డేట్స్ ఉన్నాయని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య సమాచారం, పాస్‌వర్డ్స్ వివరాలు లేవని ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే ఏజెన్సీ చెబుతున్నదానికి.. ఫేస్‌బుక్ అంగీకరిస్తూ అది ఇప్పటి సమాచారం కాదని తేల్చి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 61 లక్షలమంది భారతీయుల సమాచారంతో సహా 45 కోట్ల మంది సమాచారం సైబర్ క్రిమినల్ ఫోరమ్స్‌లో ఉచితంగా లభిస్తోందని ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ లీకేజీ కారక టెక్నాలజీ ఫీచర్‌ను సరిదిద్దామని... లీకైన సమాచారం మొత్తం 2019కి పూర్వపు సమాచారమని ఫేస్‌బుక్ తెలిపింది.