Election Polling:దేశంలో తొలి దశ ఎన్నికల ప్రచారానికి తెర.. ఏప్రిల్ 19న పోలింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలాం నడుస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా పార్టీల ప్రచారంతో వాతావరణ వేడెక్కింది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశ పోలింగ్‌కు సంబంధించి ప్రచారానికి నేటితో తెర పడింది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీల ప్రచారంతో మార్మోగిన మైకులు.. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మూగబోయాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది.
ఇందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ జరగనుంది. అలాగే రాజస్థాన్ 12, ఉత్తర్‌ప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 చొప్పున, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయాల్లో 2 చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు.
తొలిదశ పోలింగ్‌లో భాగంగా మొత్తం ఎనిమిది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. నాగ్‌పుర్ స్థానం నుంచి కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోటీ చేస్తున్నారు. అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పోటీలో ఉన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్ స్థానం నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ బరిలో నిలిచారు. ఇక న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, ఎల్.మురుగన్ వంటి ప్రముఖులు పోటీలో దిగారు. త్రిపురలోని వెస్ట్ త్రిపుర నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీలో ఉన్నారు. అలాగే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో భాగంగా ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఈనెల 25వరకు నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. కాగా దేశవ్యాప్తంగా ఏడు విడతల పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగస్తుంది. అనంతరం జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout