Pandem Kollu: కాలు దువ్వుతున్న పందెంకోళ్లు.. చేతులు మారనున్న కోట్ల రూపాయలు..
- IndiaGlitz, [Saturday,January 13 2024]
సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ముగ్గులు, గొబెమ్మలు. ఇవే కాకుండా ముందుగా వినపడేది కోడిపందాలు. మూడు రోజుల ఈ పెద్ద పండుగలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నప్పటికీ ముందుగా గుర్తుకొచ్చేది మాత్రం కోడి పందాళ్లే. వీటి కోసం ఏడాదంతా ప్రత్యేకంగా పందెం కోళ్లను సిద్ధం చేస్తుంటారు. వీటికి బలీయమైన ఆహారం పెడుతూ ఉంటారు. అలాగే ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలా పండుగ నాటికి ఆ కోళ్లను రెడీ చేసి బరిలో దింపుతుంటారు. ప్రతి పండుగకు కోట్లలో చేతులు మారుతుంటాయి. ఈసారి కూడా పండుగకు పందెం రాయుళ్లు సిద్ధమైపోయారు.
ప్రత్యేకంగా బరులు ఏర్పాటు..
ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా బరులు ఏర్పాటుచేసి పందేలు కాస్తున్నారు. పందెం కోడి బరిలో దిగా కాలు దువ్వితే అంతటా ఒక్కటే ఉత్కంఠ. గెలిచిన కోడికి పూజలు చేస్తే.. ఓడిన కోడిని వండుకుని తింటారు. అసలు పైన పేర్కొన జిల్లాల్లో అయితే ఈ పందెల కోసం ప్రత్యేక బరులు రెడీ చేశారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ పందేళ్లకు హాజరవుతారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో ఉంటాయో. కొంతమంది కోడిపందేలు చూడటం కానీ.. మరికొంతమందికి ఆడటం కానీ చేయకపోతే అసలు పండుగ జరుపుకున్నట్లే ఉండదు.
అనుమతి లేకపోయినా సరే..
ఏపీతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి పందేలు కడుతూ ఉంటారు. అయితే సాధారణంగా కోడిపందేళ్లకు అనుమతి లేదు. కోర్టులు, పోలీసులు అనుమతి లేదని ఎంత హెచ్చరించినా పందెంరాయుళ్లు వాటిని అసలు పట్టించుకోరు. మా పండుగ సాంప్రదాయం అంటారు. అందుకే అనధికారికంగా ప్రతి ఏటా పందేళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఎన్నిక ఏడాది కావడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీల వారీగా బరులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను ఆకర్షిస్తున్నారు.
పందెం రాయుళ్లను ఆకర్షించేలా..
గతంలో కంటే ఈసారి భారీ సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏ బరి ఎక్కడ ఏర్పాటు చేశారు..? అక్కడికి ఎలా రావాలనే దానికి ఏకంగా వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు ప్రత్యేక బహుమతులతో పాటు పలు రకాల వినోదాలను అందిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతి పండుగకు పందేళ్లు గట్టిగా జరగనున్నాయి.