AP BJP: ఏపీ బీజేపీలో సీట్లలో చేతులు మారిన కోట్లు.. కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు..
- IndiaGlitz, [Thursday,March 14 2024]
ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే తమకు కేటాయించిన సీట్లపై రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. గతంలో టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇప్పుడు బీజేపీకి కేటాయించారంటూ పార్టీ అగ్రనేతలకు లేఖ రాశారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన కొంతమంది నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఇచ్చేందుకు సిఫార్సు చేస్తుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
సీనియర్లకు టిక్కెట్ దక్కకుండా చేసేందుకు అనుకూలమైన సీట్లు తీసుకోలేదని మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ అంటే అధ్యక్షురాలు పురందేశ్వరి ఒకరు మాత్రమే కాదని.. చాలా మంది ముఖ్య నేతలు ఉన్నారని గుర్తుచేస్తున్నారు. అందులో ముఖ్యంగా సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, లాంటి వారు ఉంటారని చెబుతున్నారు. అయితే ఈ ఆరుగురు సీనియర్ నేతలకు అనువైన సీట్లు తీసుకోకుండా పురందేశ్వరి కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. లేనిపోని సర్వే నివేదికలు చూపించి.. వారికి అనుకూలమైన సీట్లు వచ్చే అవకాశం ఉన్నా దక్కకుండా తమ కుటుంబ పరిచయాలతో తన భర్తతో కలసి చక్రం తిప్పారంటున్నారు.
దీంతో ఇప్పుడు ఆ సీనియర్లు అందరు పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఎమ్మెల్యే సీట్ల విషయంలో వేలం పాట జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి నిధులు సమాకూర్చే నేతలు కీలకంగా మారారంటున్నారు. సొంత అవసరాలకోసం ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలమైన సీట్లను తీసుకున్నారని వాపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపి తనకు కావాల్సిన సీట్లను ఖరారు చేసుకున్నారని.. కేంద్ర ప్రతినిధి బృందాన్ని కూడా చెప్పు చేతల్లో పెట్టుకుని తెలివిగా వ్యవహరించారని చెప్పుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేసే వారు ఎవరు అంటే.. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ , గోనుగుంట్ల సూర్యనారాయణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నారు. వీరిలో ఎవరూ బీజేపీకి సేవ చేసిన వాళ్లు కాదంటున్నారు. వీరికెందుకు సీట్లు కేటాయిస్తున్నారు ?సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర పెద్దలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.