CPI Narayana : నీ తాత, తండ్రి ఎలాంటి వారు.. నీకేం కర్మ అమిత్ షాను కలిశావ్ : ఎన్టీఆర్‌పై నారాయణ వ్యాఖ్యలు
- IndiaGlitz, [Thursday,September 01 2022]
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలుగు నాట విస్తరించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో ఈ కలయికపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ స్థిరపడిన ఆంధ్రా సెటిలర్లు.. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పొందేందుకే ఎన్టీఆర్‌ను బీజేపీ దువ్వుతోందన్న ప్రచారం జరిగింది. కానీ ఈ భేటీ వెనుక కారణాలు మాత్రం సరిగ్గా తెలియరాలేదు. అయితే ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు.
అమిత్ షా ఓ స్మగ్లర్ :
ఈ క్రమంలో సీపీఐ జాతీయ నేత నారాయణ మాత్రం అందరిలా కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా యాక్టర్ల కాళ్లు పట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఏం కర్మ పట్టిందని జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షాను కలిశారని నారాయణ ప్రశ్నించారు. ఆయన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఎంతో మంచివారని.. నీకు ఏం గతి పట్టిందని అమిత్ షాను కలిశావంటూ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఎన్టీఆర్‌పై ప్రశ్నలు సంధించారు. మోడీ గుజరాత్ సీఎం కాకముందు అమిత్ షా స్మగ్లర్ అని నారాయణ ఆరోపించారు.
గుజరాత్ వాళ్లు దేశాన్ని దోచుకుంటున్నారు :
ఇకపోతే... అదానీ గ్రూప్ అధినేత, గౌతమ్ అదానీపైనా నారాయణ విమర్శలు గుప్పించారు. పనికిమాలిన పనులు చేస్తే త్వరగా ధనవంతులు అవుతారని.. గుజరాత్ వాళ్లు దేశాన్ని దోచుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు సీఎం కేసీఆర్‌ను కూడా నారాయణ అభినందించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా ఆయన కలవాలని.. జగన్‌ను కూడా ఇందుకు ఒప్పించాలని నారాయణ కోరారు. కేసీఆర్ వ్యతిరేకంగా మారారు కాబట్టి.. ఆయనను బీజేపీ టార్గెట్ చేస్తోందని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని నారాయణ ఆరోపించారు.