అప్పుడే అంబేద్కర్ పేరు పెట్టాల్సింది.. జగన్‌ ఊగిసలాట వల్లే ఇలా : కోనసీమ అల్లర్లపై సీపీఐ నారాయణ

  • IndiaGlitz, [Wednesday,May 25 2022]

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ అమలాపురంలో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కోనసీమ జిల్లాకు ముందే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వంపై నున్న వ్యతిరేకత కారణంగానే కోనసీమ భగ్గుమందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన జరుగుతున్నప్పుడే అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినా పట్టించుకోకుండా సీఎం జగన్ ఊగిసలాట ధోరణిలో వ్యవహరించారని.. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నారాయణ ఆరోపించారు.

కోనసీమకు అంబేడ్కర్ పేరు విషయంలో ప్రారంభమైన ఘర్షణలు చీలికి చిలికి గాలివానలా మారాయన్నారు. చివరకు మంత్రి విశ్వరూప్ గృహ దహనం వరకు వెళ్లిందని నారాయణ గుర్తుచేశారు. ఈ ఘటనను కులపరమైన ఘర్షణగా చూడలేమన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ప్రతిబింబంగా మారిందని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయాయని ఆయన గుర్తు చేశారు.

అంబేడ్కర్ పేరు పెట్టకుండా మొండిగా వ్యహరించి అనంతర కాలంలో ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సీఎం జగన్ సంకుచిత వైఖరిని ప్రదర్శించారని నారాయణ దుయ్యబట్టారు. ఏ విషయంలో అయినా స్పష్టత ప్రదర్శించే సీఎం ఇలా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. ఫలితంగానే కోనసీమలో ఘర్షణలు వచ్చాయని... మొత్తంగా చూస్తే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక కారణంగానే చోటు చేసుకుందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆత్మస్తుతి పరనింద పనికి రాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదని... ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి నారాయణ సూచించారు.