CP Radhakrishnan:తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్
- IndiaGlitz, [Wednesday,March 20 2024]
తెలంగాణ గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అధారే ఆయన చేత ప్రమాణం చేయించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గవర్నర్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకటించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కాగా గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజీనామాతో ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌తో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండటంతో గవర్నర్ నియామకం సాధ్యం కాదు. దీంతో పూర్తి స్థాయి గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగనున్నారు.
1957 మే 4న తమిళనాడులో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన 1998, 1999లో కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలదించారు. అయితే 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా ఓటమి పాలయ్యారు. 2016-19 మధ్య ఆలిండియా కాయిర్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 12న ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నర్లుగా పనిచేసిన నరసింహన్, తమిళిసై సౌందర్ రాజన్, ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ముగ్గురూ తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం.